నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, త్రాగునీరు, సాగునీరు, ప్రజారోగ్యం, విద్య, వాతావరణ పరిస్థితులు, ఉద్యానవనం, ఆయిల్ పామ్ విస్తరణ, రైతు రిజిస్ట్రీ, సూక్ష్మ సాగునీరు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, వానాకాలం-2026 వ్యవసాయ సీజన్‌ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ నమోదు వేగవంతం చేయడంతో పాటు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, సూక్ష్మ సాగునీటి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు, ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు, తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రుల్లో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతతో అమలు చేయాలని, ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ఫేషియల్ రికగ్నిషన్ విధానం, డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా పథకం అమలును సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. వానాకాలం వ్యవసాయ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉంచాలని, రైతు రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో త్రాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను నాణ్యతతో అమలు చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ విక్టర్, ప్రోహిబిషన్ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) పీడీ దామోదర్ , వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో చందర్, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లిఖార్జున్ జిల్లా ప్రణాళిక అధికారి రఘునందన్,తదితర అధికారులు పాల్గొన్నారు.



