– నిత్యం ప్రతి ఎంపీడీవో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలి
– కలెక్టర్ నారాయణరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గ్రామీణ, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో వారం, పది రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం అయన కలెక్టర్ కార్యాలయం నుండి మండలాల ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తదితరులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, వనమహోత్సవం కింద నాటిన మొక్కల సంరక్షణ, తాగునీరు, విద్యుత్తు తదితర పనులు నిరంతరం నిర్వహించేలా చూడాలని, గ్రామ, మండల స్థాయి అధికారులు, సిబ్బంది ప్రతిరోజు సకాలంలో విధులకు హాజరు కావడం తప్పనిసరి అని, ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి ఎంపీడీవో వారి పరిధిలో ప్రతిరోజు 2 లేదా 3 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి. అక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు తక్కువగా జరిగాయని, ఇకపై తేమ సరిపోయినంతగా వచ్చే అవకాశం ఉన్నందున వెనువెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే పత్తి రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువగా అమ్ముకోకుండా తేమ ఎక్కువగా లేకుండా పత్తిని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. సోసియో ఎకనామిక్స్ సర్వే కి సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర బీసీ కమిషన్ జిల్లాలో సోషియో ఎకనామిక్ సర్వే పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.కాగా మండలాల నుండి హాజరైన పలువురు మండలాల ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, గ్రామపంచాయతీల ద్వారా నిర్వహించే అన్ని కార్యక్రమాలు మెరుగయ్యాయని, గ్రామాల్లో జ్వర కేసులు నమోదు కావటం లేదని, షేగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్వహణ బాగుందని, రహదారులకు ఇరువైపుల నాటే మొక్కలు, సంస్థలలో మొక్కలు బాగున్నాయని, అలాగే వివిధ ప్రభుత్వ సంస్థల పనితీరు సైతం బాగుందని కలెక్టర్ కు వివరించారు.ఇందుకు స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో ఇదే ఓరవడిని కొనసాగించి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మరింత కృషి చేయాలని సూచించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.