ఆల్‌ నైన్స్‌.. ఆల్‌టైమ్‌ రికార్డు

All nines.. an all-time record–  రూ.21.60 లక్షలు పలికిన 9999
–  ఒక్కరోజే రూ.53.34 లక్షలపైగా సమకూరిన ఆదాయం: జేటీసీ జె.పాండురంగ నాయక్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖ జారీ చేసే వాహన ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోంది. స్టేటస్‌ సింబల్‌, క్రేజీ కోసం కొందరు.. అదృష్ట సంఖ్యగా భావించి మరికొందరు ఫ్యాన్సీ నెంబర్లు తీసుకుంటుండటంతో ఆర్టీఏకు ఆదాయం ఏటా పెరుగుతోంది. తాజాగా 9999 నెంబర్‌ రికార్డు స్థాయిలో రూ.21.60 లక్షలు పలికింది. 2021లో నిర్వహించిన ఈ-వేలంలో ఆల్‌ నైన్స్‌ 21.10లక్షలు పలికింది. దాదాపు రెండేండ్లుగా రవాణాశాఖ ఫ్యాన్సీ నెంబర్లను ఆన్‌లైన్‌ విధానంలో కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో పలు ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా సుమారు రూ.53.34 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌(జేటీసీ) జె.పాండురంగ నాయక్‌ తెలిపారు. వాహనదారులు స్టేటస్‌, క్రేజీ, న్యూమరాలజీ పేరుతో ఫ్యాన్సీ నెంబర్లను తీసుకుంటూ ఉండటం, నెంబర్ల కేటాయింపు ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి పారదర్శకంగా కేటాయిస్తుండటంతో వాహనదారులు ఇష్టమైన సంఖ్య కోసం నచ్చినంత చెల్లించేందుకు పోటిపడుతున్నారని చెప్పారు. రవాణాశాఖలో ఇది అరుదైన రికార్డు అన్నారు. మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ ఈ-వేలంలో ప్రైమ్‌ సోర్స్‌ గ్లోబల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ తమ ఖరీదైన వాహనం కోసం రూ. 21.60 లక్షలు వెచ్చించి టీఎస్‌09 జీసీ 9999 నెంబర్‌ను దక్కించుకుంది. అదే విధంగా టీఎస్‌09 జీడీ 0009 నెంబర్‌ను మెఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ రూ.10.50 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. టీఎస్‌09 జీడీ 0001 నెంబర్‌ను ఆంధ్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ రూ.3.01 లక్షలు వెచ్చించి కైవసం చేసుకోగా.. టీఎస్‌09 జీడీ 0006 నెంబర్‌ను గోయజ్‌ జ్యువెలరీ రూ.1.83 లక్షలు, టీఎస్‌ 09 జీడీ 0019 నెంబర్‌ను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రూ.1.70 లక్షలు, టీఎస్‌09 జీడీ 0045 నెంబర్‌ను సాయి పృథ్వీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.1.55 లక్షలు, టీఎస్‌09 జీడీ 0007 నెంబర్‌ను ఫిన్‌ ఎక్స్‌పర్ట్స్‌ రూ.1.30 లక్షలు, టీఎస్‌09 జీడీ 0027 నెంబర్‌ను శ్రీనివాస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 1.04లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాయి. ఫలితంగా ఒక్కరోజులు రవాణాశాఖ ఖాజానాకు రూ.53.34.894 ఆదాయం చేరింది.

Spread the love