‘ఇండియా’తోనే సర్వతోముఖాభివృద్ధి

'ఇండియా'తోనే సర్వతోముఖాభివృద్ధి– దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
– మోడీది నియంతృత్వ పోకడ
– ఫరీద్‌ కోట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంతకు ముందు పలు సభలు, సమావేశాల్లో ప్రసంగించారు. డిప్యూటీ సీఎం వరుసగా మూడో రోజు ఫరీద్‌కోట్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగించారు. మరోవైపు పార్టీ నేతలను సమన్వయం చేస్తూ సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఓటర్లతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. గత పదేండ్లుగా మోడీ ప్రభుత్వం అనుసరించిన పక్షపాత వైఖరి, వేధింపుల కారణంగా మన దేశం నుంచి అనేక ప్రయివేటు పెట్టుబడులు తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ భారం, ఆకస్మిక లాక్‌డౌన్‌ తదితర నిర్ణయాలు కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు కాసుల పంట పండించాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వ తప్పిదాల వల్ల దేశ ఆర్థికాభిóవృద్ధి దెబ్బతిన్నదని చెప్పారు. యూపీఏ హయాంలో దేశానికి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక వేత్తల్లో నెలకొన్న అపనమ్మకాన్ని రానున్న ఇండియా బాక్‌ ప్రభుత్వం తొలగిస్తుందని భరోసా ఇచ్చారు. చట్టబద్ధమైన పాలనతో అందరి విశ్వాసాన్ని పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడితే దేశ ఆర్థికరంగం ఒడిదుడుకులకు గురవుతుందనీ, స్టాక్‌ మార్కెట్లు పతనమవుతాయంటూ బీజేపీ నాయకులు పెట్టుబడిదారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారని విమర్శించారు. అయితే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. వారు మార్పును కోరుకుంటున్నారని ఆయన వివరించారు. విద్వేష రాజకీయాలతో దేశం విసిగిపోయిందనీ, ఇప్పుడు సొంత సమస్యల పరిష్కారానికి ఓటర్లు సిద్ధమయ్యారని గుర్తు చేశారు. యువత ఉద్యోగాల కోసం, రైతులు కనీస మద్దతు ధర కోసం, రుణమాఫీ కోసం, మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం స్వావలంబన కోసం, కార్మికులు వేతనాల రక్షణ కోసం, ఇండియా బ్లాక్‌కు ఓట్లు వేస్తున్నట్టు తెలిపారు. ప్రజల మధ్య శతృత్వాన్ని, రాష్ట్రాల మధ్య విద్వేషాలను పెంచేలా ప్రధాని మోడీ ప్రసంగాలున్నాయని ఆక్షేపించారు. మోడీ అన్నీ తానై మొత్తం దేశాన్ని నడపాలనుకోవడం ఆయన నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి హామీలను బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం అనే ప్రధాన అంశాలే ఎజెండాగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలనుకుంటున్నదనీ, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని చూస్తున్నదని విమర్శించారు. అందుకే ఈ ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమైనవి అని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వివరించారు.

Spread the love