ఎన్‌కౌంటర్లన్నీ పోలీసు ఆత్మరక్షణ చర్యలే !

– సుప్రీంకు తెలియచేసిన యుపి సర్కార్‌
న్యూఢిల్లీ : పోలీసు ఎన్‌కౌంటర్లన్నీ ఆత్మరక్షణ చర్యలేనని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. వీటిపై సక్రమంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతాయని, వీటి గురించి దాచిపెట్టడానికి ఏమీ వుండదని పేర్కొంది. తమ పోలీసుల చర్యల విచారణలకు సంబంధించి 286 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వంసుప్రీం కోర్టుకు అందచేసింది. ”నిందితులు మరణించిన ఘటనల్లో పోలీసుల ఆత్మరక్షణ చర్యలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాం. 2017 నుండి చోటు చేసుకున్న పోలీసు ఎన్‌కౌంటర్‌ ఘటనల్లో హత్యకు గురైన నేరస్తులకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు ఫలితాలు అన్నింటినీ సేకరించాం, ప్రతి నెలా పోలీసు ప్రధాన కార్యాలయంలో వాటిని పరిశీలిస్తాం. ప్రభుత్వంపై వచ్చే తీవ్రమైన ఆరోపణలు పూర్తిగా తప్పుడు ఆరోపణలు, అసమర్ధనీయమైనవి.” అని యుపి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలియచేశారు. గ్యాంగ్‌స్టర్‌ నుండి రాజకీయ నేతగా మారిన అతిక్‌ అహ్మద్‌ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఆయన సోదరి ఆయేషా నూరీ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం ఈ నివేదికను అందచేసింది. ఏప్రిల్‌లో రోజుల వ్యవధిలో తన సోదరులిద్దరి, మేనల్లుడి హత్యకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులే కారణమని ఆమె ఆరోపించారు. న్యాయ పరిధిలోకి రాని ఈ హత్యల గురించి ఆమె చేసిన ఆరోపణలపై స్పందించాల్సిందిగా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Spread the love