నవతెలంగాణ-హైదరాబాద్: సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని.. కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్టలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని అడుగుతున్నా.. పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టి మరీ ప్రభుత్వం విస్మరించిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అన్నారు.
ఈవీ బస్సులు తెస్తూ హైదరాబాద్ డిపోల్లో ఉన్న ఉద్యోగులను జిల్లాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం.. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర చేస్తోందన్నారు. కార్మికులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తోందని చెప్పారు.



