నవతెలంగాణ- హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించడం లేదంటూ బీజేపీ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి 2021లో దాఖలు చేసిన పిల్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రెండు పడకగదుల ఇళ్ల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,544 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపింది. ఇప్పటి వరకు 65,538 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 65,458 ఇళ్లను దశలవారీగా కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సెప్టెంబరు మొదటి వారం నాటికి 12,275 ఇళ్లు కేటాయిస్తామని పేర్కొంది. ఆరు విడతల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామని, నవంబరు మొదటి వారం నాటికి ఇళ్లన్నీ లబ్ధిదారులకు కేటాయిస్తామని స్పష్టం చేసింది.