పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు

Allotment of houses in a transparent manner– హైదరాబాద్‌ జిల్లాలో 2 నుంచి లబ్దిదారులకు పంపిణీ
– 15 నియోజకవర్గాలకు 500మంది చొప్పున ఎంపిక
– మొదటి విడత జిల్లాలో 7500 మందికి..: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– రాండమైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా లబ్దిదారుల ఎంపిక : కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదల సొంతింటి కల నెరవేర్చు కునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించామని పశు సంవర్ధక, మత్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమక్షంలో రాండమైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌ డ్రా నిర్వహించి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రతి నియోజకవర్గం నుంచి 500మంది చొప్పున 7,500 మందిని ఎంపిక చేశామని తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ లబ్దిదారులకు అందజేస్తామన్నారు. లక్కీ డ్రాలో ఎంపికనైన వారికి వచ్చే నెల 2వ తేదీ నుంచి ఇండ్ల పంపిణీ చేస్తామన్నారు. మానవ ప్రయత్నంతో లాటరీ ద్వారా కేటాయింపు చేసే ప్రక్రియ కన్నా ఇది ఎన్నో రెట్లు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీ తనాన్ని సూచిస్తుందన్నారు. ఈ ప్రక్రియ ఇండియాలో మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందని.. నిరంతరం కొనసాగుతుంద న్నారు. దీనిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రధాన భూమిక పోషించారని అభినందించారు.
కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి మాట్లా డుతూ.. ఎన్‌ఐసీ సహకారంతో రాండమై జేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్దిదారుల ఎంపిక చేశామ న్నారు. తక్కువ సమయంలోనే లబ్దిదారుల ఎంపిక ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీఆర్వో వెంకటాచారి, ఎన్‌ఐసీ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌కు జనం క్యూ..
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపు జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్‌కు భారీగా లబ్దిదారులు, దరఖాస్తుదారులు తరలివచ్చారు. ఉదయం 10గంటల నుంచే కలెక్టరేట్‌లో బారులు తీరారు. అయితే, దేశంలోనే మొదటిసారిగా ఎన్‌ఐసీ సహకారంతో రాండమైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌ లాటరీ ద్వారా ప్రక్రియను పూర్తిచేయడంతో కేవలం పదిహేను నిమిషాల్లో 7500 ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. అందులో తమ పేరుందా? లేదా? అనే విషయాలపై జనం కలెక్టరేట్‌లోని అధికారులను ఆరా తీస్తే.. త్వరలోనే ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందని చెప్పారు. మొబైల్‌కు సమాచారం వచ్చిన వారికి వచ్చేనెల 2న నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో ఇండ్ల కేటాయింపు చేస్తారని తెలిపారు.

Spread the love