ప్రజాస్వామ్య విలువలపై అంబేద్కర్‌ ఆలోచనలు

భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కూలితే మొట్ట మొదటి బాధితులు దళితులు, మైనారిటీ, అణగారిన వర్గాలు. వీళ్ళ నిశ్శబ్దం సామాజిక వ్యవస్థలపై రాజ్య ప్రభావాన్ని చాల నగంగా మన కళ్ళ ముందుకు ఆవిష్కరిస్తుంది. ఇది వారి నిశ్శబ్దం లాగా చూడకుండా రాజ్యం వారిని ఎలా సైలెన్సింగ్‌ చేస్తుందో చూడాలి.
ఈ విషయం పైన ఇంకొంచెం లోతుగా మరి ముఖ్యంగా డాక్టర్‌ అంబేద్కర్‌ గారి ఆలోచనలతో విశ్లేషించాలి. రాజకీయ ప్రజాస్వామ్య, సామాజిక ఉద్యమాల విజయానికి అవసరమైన పరిస్థితుల దృష్టికోణంలో నుంచి ఆలోచించాలి. డాక్టర్‌ అంబేద్కర్‌ దృష్టిలో, ప్రజాస్వామ్యం అంటే ఒక రూపం, ఒక పద్ధతి, నెత్తురు చుక్క పడకుండా ప్రజల జీవితాలలోని సామాజిక, ఆర్థిక అంశాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వ్యవస్థ. అలాగే, ప్రజాస్వామ్య విలువలను సామాజిక సంబంధాలలో మాత్రమే వెతకాలనీ, అదొక జీవనవిధానం అంటారు, అది ప్రజలను, సమాజాన్ని కలిపి ఉంచే వ్యవస్థ అని కూడా అంటారు.
ప్రజాస్వామ్యాన్ని నిర్వచించడమే కాకుండా అది అనేక చిక్కులు నుండి అధిగమించడానికి గల ఉపకరణాలను అందిస్తుందని అంబేద్కర్‌ ఆలోచించారు. ప్రజాస్వామ్య దృక్కోణం ఎల్లప్పుడు సామాజిక ధోరణిలో ఉండాలని, రాజకీయ కోణంలో చూడకూడదని వారు అభిప్రాయపడ్డారు. సోదరభావం, సమూహ భావం వంటివి మాత్రమే సామాజిక సంబంధాలను గట్టిపరుస్తాయి. అంబేద్కర్‌ గారి అభిప్రాయంలో రక్తపు చుక్క రాలకుండా విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అవి సామాజిక సంబంధాలలో మాత్రమే రావాలి.
అయితే ఇప్పటివరకు భారత ప్రజాస్వామ్య ప్రయాణం అంత సాఫీగా, సులభంగా ఏమిజరగలేదు. ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోత, గోద్రా అల్లర్లు, అసంఖ్యాకమైన కుల దౌర్జన్యాలు వంటి అనేక సవాళ్లను అది ఎదుర్కొంది. భారత దేశ స్వతంత్ర, ప్రజాస్వామ్య ఫలాలను భారతీయ జనాభాలో ఎక్కువ శాతం అనుభవించ లేదు. నీరు, విద్య, ఆరోగ్యం వంటి కనీస సౌకర్యాలు ఇప్పటికీ వారికి అందుబాటులోలేని పరిస్థితి. ఇటీవల కోవిడ్‌ ఆ సంక్షోభ వైఫల్యాన్ని చూపింది.
ప్రజాస్వామ్యంలో సవాళ్లు, పరిమితులు, వైఫల్యాల గురించి, సెప్టెంబర్‌ 1943లో ఢిల్లీలో జరిగిన ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ వర్కర్స్‌ స్టడీ క్యాంపులో ప్రసంగిస్తూ డాక్టర్‌ అంబేద్కర్‌ ”పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది వంశపారంపర్య పాలిత వర్గం, వంశపారంపర్య పాలక వర్గం” మధ్య ఉన్న సైద్ధాంతిక విభజన, ఆ విభజన క్రమంగా జఠిలంచేసి పాలిత వర్గాలు అనుసరించేలా చేశారు. ఇప్పుడున్న రూపంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేదలకు గాని, కార్మిక వర్గం లేదా అణగారిన వర్గాలకు గాని పనికిరాదని కూడా ఆయన అన్నారు. ఒకవేళ అది విజయవంతం అవ్వాలంటే ఈ కులాలు, కార్మిక వర్గాలు ప్రభుత్వంలో క్రియాశీలమైన బాధ్యత పోషించాలి. రెండవది పెట్టుబడిదారీ, మత తత్వ పార్టీలతో దూరంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. అలా జరగక, ఒకవేళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమైతే, అది తిరుగుబాటు, అరాచకం, మతతత్వానికి దారి తీస్తుంది అని అన్నారు. అయితే ఒక విజయవంతమైన ప్రజాస్వామ్యానికి ఎటువంటి పరిస్థితులు అవసరం? ఆ పరిస్థితులను డాక్టర్‌ అంబేద్కర్‌ ఆర్థిక, సామాజిక నిర్మాణంలో చూశారు. ప్రతి ఒక్కరికి రాజకీయ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ఉండటం. మరో మాటలో చెప్పాలంటే, రాజకీయ ప్రజాస్వామ్యం విజయం సాధించాలంటే సామాజిక, ఆర్థిక స్వేచ్ఛలలో స్వతంత్రం సంపాదించడం.
సామాజిక న్యాయం అనే మౌలిక సూత్రాల పైన సామాజిక ప్రజాస్వామ్యం ముడిపడి ఉంటుంది. న్యాయం ఎల్లప్పుడూ 1.సమానత్వంతో కూడిన ఆలోచనలు, 2. నియమాలు, నిబంధనలు, 3.హక్కులకు సంబంధించిన విలువలతో ముడిపడి ఉంటుంది. డాక్టర్‌ అంబేద్కర్‌ సామాజిక న్యాయ భావనలో సమానత్వానికి ప్రధాన స్థానం ఉంది. స్వేచ్ఛ, స్వతంత్ర, సౌభ్రాతృ త్వం అనేవి సమానత్వపు ఉన్నత భావనలు. అయితే భారతీయ కుల వ్యవస్థ వీటిని దళితులకు నిరాకరించింది. క్లుప్తంగా సామాజిక ప్రజాస్వామ్యం అంటే సమానత్వం, సౌభ్రాతృత్వం ఆధారంగా ఏర్పడిన సామాజిక సంబంధాలు తప్ప మరేమీ కాదు.
సామాజిక సంబంధాలను విధానాల రూపంలో చూడాలనుకుంటే ముందుగా మనకు తట్టేవి రిజర్వేషన్లు, గ్రామీణ హామీ చట్టం, వెనుకబడిన వర్గాలకు పథకాలు వంటివే అయితే 1990ల నుంచి నయా-ఉదారీకరణ వలన, కనీస అవసరాలు (కూడు, గూడు, బట్ట) తీర్చడంలో రాజ్యం వెనకడుగు వేయడం మూలాన ఈ విధానం పక్కదారి పట్టింది. అవి చివరకు ప్రణాళికా సంఘాన్ని చంపే వరకు వచ్చింది. 1990ల తర్వాత మార్కెట్టుపైన ప్రయివేటు రంగం ఎక్కువ నియంత్రణను కలిగి ఉందని, అందువలన ప్రణాళికలకు ఇక కమిషన్‌ అనవసరమని, దాన్ని ఉపసంహరించి దానిబదులుగా నిటి అయోగ్‌ తెచ్చారు. అయితే ప్రయివేటీకరణ లేదా ప్రయివేటు ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలోనే ప్రణాళికా సంఘం అవసరం ఎంతైనా ఉంది.
మరి ఆర్థిక ప్రజాస్వామ్యం గురించి ప్రశ్న వచ్చినప్పుడు డాక్టర్‌ అంబేద్కర్‌ ఒక నిర్దిష్ట రకమైన సోషలిజం రూపంలో ప్రత్యామ్నాయ ఆర్థిక చట్రాన్ని ప్రతిపాదించాడు. అందులో కీలకమైన వ్యవసాయం, విద్య, వైద్యం, బీమా, రాజ్యం చేతిలో ఉండాలని మిగతా ప్రయివేటు వారి చేతులో పెట్టాలని సూచించారు. ఇప్పుడు మనం చూస్తున్నది అంబేద్కర్‌ ప్రతిపాదించిన సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం. డాక్టర్‌ అంబేద్కర్‌ ఆర్థిక విధానం మార్క్సిస్టు ఆలోచనా ధోరణి అయిన శాసన-రాజ్య సోషలిజంకు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం. ఆయన విధానంలో రాజ్యాంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలా అయితే శాసనసభ గాని, కార్యనిర్వాహక వ్యవస్థగానీ రాజ్యాంగాన్ని మార్చలేవు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో సోషలిజానికి స్థిరత్వం సాధించవచ్చు, నియంతృత్వాన్ని నివారించవచ్చు. నిశితంగా పరిశీలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరులో కొన్ని వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి, అలాగే అవి ప్రజాస్వామ్య విలువలను అస్థిరపరచనూ గలుగుతాయి. అవి కుల వ్యవస్థ, భాష, మతం.
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వంను నిరాకరిస్తుంది. హిందూ మత వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణం వేరు చేయడం, బహిష్కరించడం, అంటరాని వారిని చేయడం, ఇవి సామాజిక వ్యతిరేక స్ఫూర్తి చిహ్నాలు. ఈ వేరుచేయబడిన దళితులు ఇప్పటికి నీళ్ల కోసం, నీడ కోసం పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు, రాజ్యం మాత్రం దాని రోజువారీ కార్యకలాపాలను రాజకీయాల చుట్టూ మాత్రమే తిప్పుతుంది, ఆ ప్రక్రియలో ఆర్థిక, సామాజిక పరమైన అంశాలు నిర్లక్ష్యం చేయబడతాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపే సామర్థ్యం కులానికి ఉందంటారు అంబేద్కర్‌. అలాగే దానికి ప్రజా ధార్మిక భావాన్ని నాశనం చేయగల సామర్థ్యం కూడా ఉందంటారు. ఉదాహరణకు ప్రతి వ్యక్తి తన కుల చట్రం లోపల మాత్రమే పని చేస్తాడు, అతను, ఆమె వారి కులానికి అత్యంత విధేయత చూపుతారు. వాక్కు నుండి రాతకు మారక ముందు, సాహిత్య, విద్య మీద ఉన్న పట్టుతో, కొన్ని సామాజిక వర్గాలు (బ్రాహ్మణులు), వాటిని నియంత్రణ సాధనాలుగా ఉపయోగిం చాయి. 1. అధికారంలో ఉన్న వారికి (పరిపాలన, చట్టపరమైన, ఆర్థిక పరమైన ఖాతాలు, రికార్డ్‌ కీపింగ్‌) 2. వైదిక ఆచారాలపైన వారి పట్టు. ఈ రెండు, ఒకటి మెటీరియల్‌ మరొకటి సింబాలిక్‌ (ఆచారం). ఈ రెండింటితో వారు సమాజం పైన సామాజిక ఆధిపత్యాన్ని సాధించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆలోచనతో అంబేద్కర్‌ ఈ ఆధిపత్యాన్ని పంక్చర్‌ చేయడానికి ప్రయత్నం చేశారు. సాంస్కృతిక బహుళత్వం, రాజకీయ ప్రజాస్వామ్యం అలాగే సామాజిక భిన్నత్వం, రాజకీయాధికారం మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిం చాడు. ఈ సందర్భంలోనే రాజ్యాంగం దృష్టి సారించాల్సిన రెండు అంశాలను అంబేద్కర్‌ తన ‘రాష్ట్రాలు – మైనారిటీలు’లో వెలిబుచ్చారు. భాషా పరమైన రాష్ట్రాలు (ఒక భాష ఒక రాష్ట్రం) ఏర్పర్చడం వలన సామాజిక ఆధిపత్యం, రాజకీయ ప్రజాస్వామ్య చిక్కులను విడిపించవచ్చు, అలాగే దళితులు కూడా అభివృద్ధి ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది, సమానత్వం, సమన్యాయం పొందగలుగుతారు.
కానీ అంబేద్కర్‌ ఆలోచనలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన భాషాపరమైన బహుళత్వం, బహుభాషా తత్వాలకు అంతరాయం ఏర్పడి ”చతుర్వర్ణ భాషలను” సృష్టించింది. (భీమా కోరెగావ్‌ కేసులో అరెస్ట్‌ అయిన హనీ బాబు ఉపయోగించిన పదం). చతుర్వర్ణ భాషలంటే-సంస్కృతం, హిందీ,షెడ్యూల్డ్‌ మరియు నాన్‌-షెడ్యూల్డ్‌ భాషలు. ఈ వర్గీకరణ వలన కొత్త చీలికలు, వైరుధ్యాలు బయటపడ్డాయి. దీని వలన మెజారిటీ, మైనార్టీ, ఆధిపత్య, సబార్డి నేట్‌, ప్రివిలేజ్డ్‌, అండర్‌ ప్రివిలేజ్డ్‌ వంటి బైనరీ సృష్టించ బడ్డాయి. ఇంగ్లీష్‌ ఈ బైనరీ బయట ఉండి అంటరానిదిగా మారి అట్టడుగు వర్గాలకు అందుబాటులోకి వచ్చి భాషను ప్రజాస్వామీకరణ చేసింది.
75ఏండ్ల క్రితం భారతదేశ స్వాతంత్య్రం మత ప్రాతిపదికన కాకపోయినా మతం ప్రధాన పాత్ర పోషించింది. 1976లో మాత్రమే సోషలిస్టు, సెక్యులర్‌ అనే పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చాం. మతపరమైన అసహనం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టుతుంది, ఆ సంక్షోభం రాజ్యాంగపరమైన, ప్రజాస్వామ్య పరమైనదని అంబేద్కర్‌ అన్నారు. ఈ పరిమితులుకు జవాబులు అంబేద్కర్‌ బౌద్ధమతంలో వెతికారు. ఆయన బౌద్ధమతాన్ని ఫ్రెంచ్‌ విప్లవంతో పోల్చి చూశారు. బౌద్ధమతం దళితులకు ప్రజాస్వామ్యం, సామ్యవాదానికి గల మార్గాలను చూపగలదు అని అన్నారు.
భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని మాత్రమే గౌరవించాలని డాక్టర్‌ అంబేద్కర్‌ కోరారు. రాజకీయ ప్రజాస్వామ్యం విజయం సాధించాలంటే దాని పునాది సామాజిక ప్రజాస్వామ్య భావాలతో ఉందన్నారు. 26 జనవరి 1950న ప్రసంగిస్తూ అంబేద్కర్‌, ”మనం వైరుధ్యాల జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రాన్ని పాటించాం, అయితే సామాజిక, ఆర్థిక నిర్మాణంలో ఒక మనిషి, ఒక విలువ అనే సూత్రాన్ని మాత్రమే పాటిస్తున్నాం” అని అన్నారు. ఈ వైరుధ్యాలను అధిగమించాలంటే దేశాన్ని మతాన్ని కన్నా గొప్పగా చూడాలని కోరారు. లేకపోతే మన స్వాతంత్రం ప్రమాదంలో పడుతుందని కూడా హెచ్చరించారు. ఆయన ఆలోచనలు, విలువలు గౌరవించి పాటిస్తే సామాజిక ప్రజాస్వామ్య విలువలను పాటించినట్లవుతుంది.

Spread the love