Homeక్రైమ్గణేశ్‌ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్‌..రెండేళ్ల బాలుడి మృతి

గణేశ్‌ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్‌..రెండేళ్ల బాలుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ-ఖమ్మం : గణేశ్‌ శోభాయాత్ర సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌లో అంబులెన్స్‌ చిక్కుకోవడంతో ఓ రెండేళ్ల బాలుడి ప్రాణం పోయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వాహనం ముందుకు కదలకపోవడంతో.. తండ్రి తన కుమారుడిని భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా బోనకల్‌ ఎస్టీ కాలనీకి చెందిన భూక్యా సైదులు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు వైభవ్‌ నాయక్‌ (2) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తొలుత బాలుడిని ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఖమ్మం నగరంలోని పాతబస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాలుడిని మరో ఆస్పత్రికి తరలించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని జెడ్పీ సెంటర్‌ సమీపంలోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో బయలుదేరారు.

అంబులెన్స్‌ ముందుకు వెళ్తున్న సమయంలో అదే మార్గంలో గణేశ్‌ శోభాయాత్ర సాగుతోంది. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితిలో ఉన్న బాలుడిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ కూడా రద్దీలో చిక్కుకుపోయింది. సమయం గడిచిపోతుండటంతో ఆందోళనకు గురైన తండ్రి సైదులు.. అంబులెన్స్‌ నుంచి కుమారుడిని బయటకు తీసి భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. అయినప్పటికీ బాలుడి పరిస్థితి అప్పటికే విషమించినట్లు తెలుస్తోంది.

ఆస్పత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు బాలుడికి పరీక్షలు నిర్వహించారు. అయితే అప్పటికే వైభవ్‌ మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో తమ కుమారుడిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే బతికేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -