Homeఖమ్మంవర్షాభావం తీర్చిన ఆర్నాబ్ తుపాన్

వర్షాభావం తీర్చిన ఆర్నాబ్ తుపాన్

- Advertisement -

– మూడు రోజులుగా విస్తారంగా వానలు..
– లోటు పూర్తిగా తీరకపోయినా పంటలకు ప్రాణం
– రైతుకు ఊరట.. 
– జిల్లా వర్షపాత లోటు 20.2 శాతానికి తగ్గుదల
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆర్నాబ్ తుపాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.వానాకాలం ముగింపు దశలో కురిసిన ఈ వర్షాలు పూర్తిగా వర్షాభావాన్ని తొలగించకపోయినా,పొలాల్లో తేమను పెంచి పంటలకు ఊరటనిచ్చాయి.గత కొంతకాలంగా వానల కోసం ఎదురుచూసిన రైతుల్లో ఈ వర్షాలు కొత్త ఆశలు నింపాయి.

గురువారం (25వ తేదీ) జిల్లాలో సగటున 35.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఈ వానాకాలంలో ఇప్పటివరకు 761.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, సాధారణంగా 954.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంది. దీంతో జిల్లా వర్షపాత లోటు 20.2 శాతానికి తగ్గింది.

జిల్లాలోని 23 మండలాల్లో 10 మండలాలు సాధారణ వర్షపాతం కేటగిరీ లోకి చేరగా, 13 మండలాలు ఇంకా లోటు పరిస్థితి లోనే ఉన్నాయి. అత్యధికంగా చర్లలో 95.2 మి.మీ., చండ్రుగొండ లో 63.4 మి.మీ., కరకగూడెం లో 58.6 మి.మీ., అశ్వారావుపేటలో 49.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.

పంటలకు ప్రాణం పోసిన వాన:
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరి, పత్తి, మొక్కజొన్న, ఆయిల్‌పామ్‌తో పాటు ఇతర పంటలకు అవసరమైన నేల తేమ లభించింది. చెరువులు, వాగులు, కాలువల్లోకి నీరు చేరడంతో వ్యవసాయ కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో మొత్తం 4,29,141 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం పంటల దశలను పరిశీలిస్తే—

* వరి (1,25,506 ఎకరాలు): పొట్ట దశలో ఉండటంతో ఈ వర్షాలు దిగుబడికి కీలకంగా మారాయి.

* పత్తి (2,37,240 ఎకరాలు): పూత, కాయ ఏర్పడే దశలో ఉండటంతో తేమ వల్ల మొక్కల ఎదుగుదలకు ఊతం లభించింది.

* మొక్కజొన్న (66,428 ఎకరాలు): గింజ గట్టిపడే దశలో వర్షం ప్రయోజనకరంగా మారింది.

* పెసర (7,446 ఎకరాలు): కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉండగా, మరికొన్ని చోట్ల తేమ ప్రయోజనం కలిగించింది.

* మినుము (3,049 ఎకరాలు): శాకీయ దశలో ఉండటంతో ఎదుగుదలకు అనుకూలంగా మారింది.

* కంది (3,632 ఎకరాలు), వేరుశనగ (4,098 ఎకరాలు), కూరగాయలు (1,871 ఎకరాలు): నేలలో తేమ పెరగడంతో సాగు పరిస్థితులు మెరుగుపడ్డాయి.

* ఆయిల్‌పామ్ (4,684 ఎకరాలు): కొత్తగా సాగు చేయాలనుకుంటున్న రైతులకు మొక్కలు నాటేందుకు ఇది అనువైన సమయమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

వర్షపాత స్థితి:

* జిల్లా వర్షపాత లోటు: 20.2%

* సాధారణ స్థితిలో ఉన్న మండలాలు: 10

* లోటు మండలాలు: 13

* గురువారం జిల్లా సగటు వర్షపాతం: 35.3 మి.మీ.

* అత్యధిక వర్షపాతం: చర్ల – 95.2 మి.మీ.

ఈ మూడు రోజుల వర్షాలు వానాకాలం చివరి దశలో రైతులకు గణనీయమైన ఊరటనిచ్చినా, జిల్లా మొత్తం వర్షపాత లోటు పూర్తిగా పూడ్చుకోవాలంటే మరికొంత వర్షం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -