స్టాగ్‌ఫ్లేషన్‌ ముప్పును ఎదుర్కొంటున్న అమెరికా

America is facing the threat of stagflation– బిజినెస్‌ ఇన్‌సైడర్‌
అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ విడుదల చేసిన తాజా స్థూల ఆర్థిక డేటా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభన దిశగా పయనిస్తున్నట్లు సూచిస్తోందని న్యూయార్క్‌ నగరం ప్రధాన కేంద్రంగా అంతర్జాతీయ వ్యాపార వార్తలను అందించే బిజినెస్‌ ఇన్‌సైడర్‌ విశ్లేషించింది. నిరాశాజనకంగా వున్న సంకేతాలు రాబోయే కఠినమైన సవాళ్లను సూచిస్తున్నాయని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ రాసింది. ప్రస్తుత సంవత్సరం మొదటి త్రైమాసికంలో అమెరికన్‌ జీడీపీ వార్షిక వద్ధి రేటు 1.6శాతం మాత్రమే పెరిగిందని, ఇది 2.5శాతం అంచనాలకంటే చాలా వెనుకబడి ఉందని గురువారంనాడు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ వెల్లడించింది. 2023 అక్టోబరు-డిసెంబర్‌లో నమోదైన 3.4శాతం, అంతకుముందటి త్రైమాసికంలో 4.9శాతం వద్ధి కంటే వర్తమానంలో వద్ధి రేటు చాలా మందకొడిగా సాగుతోంది. ”ఇది రెండు వైపులా అత్యంత చెత్తగా ఉంది – ఊహించిన వద్ధి కంటే నెమ్మదిగాను, ఊహించిన ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగాను ఉంది” అని సీఐబీసీ ప్రైవేట్‌ వెల్త్‌ అమెరికా చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ డొనాబెడియన్‌ బిజినెస్‌ ఇన్‌సైడర్‌కి చెప్పాడు. బలహీనమైన వద్ధి, పెరుగుతున్న వినియోగ వస్తువుల ధరలు స్టాగ్‌ ప్లేషన్‌ లేక మందగాడి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో నెలకొన్నదనుకోవటానికి ప్రత్యేక సంకేతాలుగా ఉంటాయి. ఇది దీర్ఘకాలం పాటు ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ద్వారా వ్యక్తీకరించబడుతుంది. గతంలో ఒకసారి 1970లలో అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థను స్టాగ్‌ ప్లేషన్‌ ఆవహించింది. ఆ కాలంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు పెరిగి ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు అమెరికా చివరిసారిగా స్టాగ్‌ఫ్లేషన్‌ను ఎదుర్కొంది. అమెరికా విధాన నిర్ణేతలు కీలక వడ్డీ రేటును 20శాతం వరకు పెంచడం ద్వారా ధరలను తగ్గించారు. అయితే దానితో ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి జారుకుంది.మార్చిలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటు పెంపును వాయిదా వేసింది. అమెరికాలో ప్రస్తుతం వడ్డీరేట్లు 5.25శాతం – 5.5శాతం శ్రేణిలో ఉన్నాయి. ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తదుపరి సమావేశం మే 1న జరగనుంది. ఇదే కాలంలో ఫెడ్‌ ద్వారా కీలక ద్రవ్యోల్బణ కొలతగా ఉపయోగించే వ్యక్తిగత వినియోగ వ్యయ ధరల సూచిక 3.4శాతం వార్షిక వేగంతో పెరిగింది. ఇది ఒక సంవత్సరంలో జరిగిన అతిపెద్ద పెరుగుదలగా ఉంది. అమెరికా వినియోగదారుల వ్యయంలో పెరుగుదల జనవరి నుంచి మార్చి వరకు 2.5శాతంగా ఉంది. ఇది 2023 నాల్గవ త్రైమాసికంలో 3.3శాతం పెరుగుదల నుంచి తగ్గిందని, అంచనా వేసిన 3శాతం కంటే తక్కువగా ఉందని బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ అనాలిసిస్‌ పేర్కొంది. ఏదైనా రేటు తగ్గింపులు జరగడానికి ముందు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టాల్సిన అవసరం ఉందని రెగ్యులేటర్‌ స్పష్టం చేసినందున, ఇది ఫెడ్‌ చర్య తీసుకునే సామర్థ్యంపై తీవ్రమైన పరిమితులను కలిగిస్తుందని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ రాసింది.

Spread the love