యుద్ధ క్షేత్రంలో పరిస్థితి ‘సంక్లిష్టం’

The situation on the battlefield is 'complex'.– ఉక్రెయిన్‌ టాప్‌ మిలిటరీ కమాండర్‌
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్‌ పరిస్థితి ”సంక్లిష్టం”గా ఉందని ఉక్రెయిన్‌ సాయుధ దళాల కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ సిర్‌స్కీ శుక్రవారంనాడు జరిగిన వర్చువల్‌ రామ్‌స్టెయిన్‌ గ్రూప్‌ సమావేశంలో ఉక్రెయిన్‌ పాశ్చాత్య మద్దతుదారులతో అన్నాడు. డాన్‌బాస్‌ ప్రాంతంలో కొనసాగుతున్న రష్యన్‌ దాడులలో ఉక్రేనియన్‌ మిలిటరీ కేవలం ఒక వారంలో 8,000 మందికి పైగా సైనికులను కోల్పోయిందని రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ”నేను… కష్టతరమైన కార్యాచరణ, వ్యూహాత్మక పరిస్థితి గురించి సంకీర్ణ సభ్యులకు తెలియజేశాను. పరిస్థితులు మరింతగా దిగజారి పోతున్నాయి” అని సిర్‌స్కీ శనివారం ఒక టెలిగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపాడు. ఇందులో ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందించడంపై పాశ్చాత్య దేశాలతో చర్చల గురించి మాట్లాడాడు. ఉక్రెయిన్‌కు క్షిపణులు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, సైనిక పరికరాలు ”తక్షణావసరం” అని జనరల్‌ చెప్పాడు.
ఉక్రెయిన్‌కు 61 బిలియన్‌ డాలర్ల విలువైన సైనిక సహాయ ప్యాకేజీని అమెరికా ఇటీవల ఆమోదించింది. అమెరికా సరిహద్దు నియంత్రణ వ్యయంపై వైట్‌హౌస్‌ నుండి రాయితీలు కోరిన రిపబ్లికన్‌ చట్టసభ సభ్యులు దానిని నిరోధించినందున అత్యవసర వ్యయ బిల్లు నెలల తరబడి కాంగ్రెస్‌లో నిలిచిపోయింది. ఉక్రెయిన్‌ కోసం ఉద్దేశింపబడిన సహాయానికి అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం తెలపటాన్ని ఉక్రేనియన్‌ ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ స్వాగతించాడు. మరిన్ని పాశ్చాత్య ఆయుధాలతో తన దేశానికి ”విజయం సాధించే అవకాశం” ఉందని అతను ఎన్‌బిసికి చెప్పాడు. ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిత్రి కులేబా ఈ విషయంపైన తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. ”ఏ ఒక్క ప్యాకేజీ రష్యన్‌లను ఆపలేదు” అని ఆయన అన్నాడు.
ఏ పాశ్చాత్య ఆయుధాలూ యుద్ధ క్షేత్రంలోని చలనశీలతను మార్చలేవని రష్యా ప్రకటించింది. రష్యా ఈ సంవత్సరం ప్రారంభం నుండి దాడులను తీవ్రతరం చేస్తోంది. ఫిబ్రవరిలో వ్యూహాత్మక డాన్‌బాస్‌ నగరమైన అవదీవ్కాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి రష్యన్‌ దళాలు పశ్చిమంవైపు మరింతగా ముందుకు దూసుకు పోతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి. గత వారంలో రష్యా ఉక్రేనియన్‌ దళాల నుంచి రెండు ఆవాసాలను స్వాధీనం చేసుకున్నదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
2022 ఫిబ్రవరిలో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ దాదాపు 500,000 మంది సైనికులను కోల్పోయిందని ఈ నెల ప్రారంభంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించాడు. అందువల్లనే ఉక్రేనియన్‌ ప్రభుత్వం, సైనికాధికారులు తమ నష్టాలను భర్తీ చేయాల్సిన తక్షణ అవసరాన్ని పదేపదే ఎత్తి చూపుతున్నారు. ఇటీవల సైనిక మోబిలైజేషన్‌ వ్యవస్థ సమూల సంస్కరణ చట్టంపైన జెలెన్‌స్కీ సంతకం చేశాడు. సైన్యంలో చేరకుండా తప్పించుకునే వారికి కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టడం ద్వారా వేలాది మందిని నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలను ఉక్రెయిన్‌ ముమ్మరం చేసింది.

Spread the love