25న సిద్దిపేటకు అమిత్ షా రాక

– మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు

నవతెలంగాణ – సిద్దిపేట
ఈనెల 25న సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు బిజెపి జాతీయ నాయకులు అమిత్ షా హాజరుకానున్నట్లు మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కూడా హాజరవుతారని అన్నారు. 13న జరిగే ఎన్నికల కోసం ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గం నుండి 30 వేల మందిని ఈ సభకు సమీకరించనున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. తనను గెలిపిస్తే 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానన్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్సీ పదవిని  అనుభవిస్తున్నాడని, ఎక్కడ తన నిధులు ఖర్చు చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్రీగా కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ పదవి వచ్చిందని అన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లలో, తెల్లాపూర్ వద్ద నిర్మించిన రింగ్ రోడ్ మూలంగా చాలామంది నిరుపేదల నుండి భూములను తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని తెలిసిందని, అధికారులు మీ విధులను మాత్రమే నిర్వహించాలని, బీజేపీ కంప్లైంట్ ఇచ్చిందని అధికారులు బాధ పడవద్దు అని అన్నారు. బాధితులందరికీ క్షమాప చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని వెంకటరామిరెడ్డికి సూచించారు. అమిత్ షా హాజరయ్య సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, నాయకులు శంకర్, మార్కండేయులు, నరేష్ , వేణు తదితరులు పాల్గొన్నారు.
Spread the love