
పాఠశాలలు పున: ప్రారంభమయ్యే లోపు ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామరావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి గుగులోతు రాము అధ్యక్షతన బుధవారం అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లతో పాఠశాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ మండలంలోని మొత్తం 31 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల మరమ్మతులు, మేజర్ మైనర్ రిపేర్లు, విద్యుత్ సౌకర్యం తదితర అభివృద్ధి పనుల నిర్వహణకు 31 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు. ఆ పాఠశాలల్లో పనుల నిర్వహణకు ఇంజనీర్ల నివేదికల ప్రకారం రూ కోటి 11 లక్షల ఎస్టిమేట్ చేయడం జరిగిందని, ప్రతి పాఠశాలకు ప్రస్తుతం 25 శాతం నిధులు మంజూరై అమ్మ ఆదర్శ పాఠశాల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పారు. సంబంధిత నిధులతో పనుల నిర్వహణ జరుగుతున్నదన్నారు. ఇప్పటివరకు చాలా పాఠశాలల్లో పనుల నిర్వహణ నత్తనడకన నడుస్తున్నదని, ఇకనుండి పనుల నిర్వహణలో వేగం పెంచాలని చెప్పారు. పనుల నిర్వహణలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 7 లోపు పూర్తి చేయాలని తెలిపారు. పనుల పురోగతిపై ప్రతిరోజు జడ్పీ సీఈవో తో పాటు జిల్లా ఉన్నత అధికారులు పర్యవేక్షిస్తూ నివేదికను రోజువారీగా కలెక్టర్కు సమర్పిస్తున్నారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా వనులను తక్షణమే పనులను పూర్తి చేయాలని సూచించారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలరాజు, మండల విద్యాశాఖ అధికారి గుగులోతు రాము, ఏపిఎం వరదయ్య, ఏఈఈ రాజు ,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లు, మండల ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ ఎం. సుధాకర్, సిఆర్పిలు బి. కవిత, జె .కవిత,బి వీరస్వామి, మెసెంజర్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.