అమ్మఒడి శంకర్ మరణం తీరని లోటు

– సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్
నవతెలంగాణ – భువనగిరి
 అనాధల, మానసిక వికలాంగుల ఆశ్రమం “అమ్మ ఒడి” , వ్యవస్థాపకులు, నిర్వాహకులు జెల్లా శంకర్ మరణం తీరని లోటని సామాజిక  కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. చౌటుప్పల్ కు చెందిన జెల్లా శంకర్ గత పది సంవత్సరాల క్రితం ఆలేరు లో అనాధల, మానసిక వికలాంగుల కొరకు “అమ్మఒడి” ఆశ్రమం నెలకొల్పి, సేవలందించిన గొప్ప సేవాతత్పరుడని ఆయన అన్నారు. గురువారం చౌటుప్పల్ లో శంకర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కొడారి వెంకటేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా, ఎంతో శ్రమకోర్చి ఆశ్రమం నిర్వహించిన శంకర్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన శంకర్ 2009 నుండి 2014 వరకు “ప్రత్యేక తెలంగాణ ఉద్యమం” లో క్రియాశీలకంగా పాల్గొని, కోర్టు కేసులు తిరిగి జైలుశిక్ష అనుభవించాడని ఆయన అన్నారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం మేనిఫెస్టో లో ప్రకటించిన విధంగా జెల్లా శంకర్ కుటుంబానికి 250 గజాల  ఖాళీ స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. గత దశాబ్దం క్రితం ఆలేరు లో అమ్మఒడి ఆశ్రమం ను ఏర్పాటు చేసి, ఆ తరువాత  పెద్ద కందుకూరు లో,ఆ తరువాత వంగపల్లి లో నిర్వహిస్తూ, సుమారు ముప్పై మంది అనాథలకు , మానసిక వికలాంగులకు  నిస్వార్థంగా సేవలందించిన  జెల్లా శంకర్ సేవలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం గురించి సరిగ్గా పట్టించుకోకపోడంతో, ఈ నెల 10న (బుధవారం రాత్రి) ఆశ్రమ నిర్వాహకుడు  మరణించడంతో, ఆశ్రమం పెద్దదిక్కు కోల్పోయిందని, ఆశ్రమ వాసుల్లో విషాదచాయలు అలుముకున్నాయని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఆశ్రమం లోని అనాధలను, మానసిక వికలాంగులను ఇతర ఆశ్రమం లోనికి చేర్చి, ఆదుకోవాలని ఆయన కోరారు. గురువారం చౌటుప్పల్ లో జెల్లా శంకర్ అంతిమయాత్రలో నాయకులు ఉప్పు కృష్ణ, మచ్చ ఉపేందర్,ఇంజ పద్మ  పాల్గొని నివాళులు అర్పించారు.
Spread the love