బీఆర్ఎస్ కు మూకుమ్మడి రాజీనామాలు!

నవతెలంగాణ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు ఆ పార్టీ  కౌన్సిలర్లు  షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్(BRS)కు 21 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 19 మంది సంతకాలు చేసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. సంతకాలు చేయనప్పటికీ వైస్‌ ఛైర్మన్‌ సుదర్శన్‌తో పాటు 14వ వార్డు కౌన్సిలర్‌ బొడ్డు నారాయణ సైతం రాజీనామాకు అంగీకరించినట్టు తెలిసింది. వారం క్రితం బీఆర్ఎస్ కు చెందిన 18 మంది కౌన్సిలర్లు బస్సులో శిబిరానికి తరలి వెళ్లారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉండగా.. వీటిలో ఒక వార్డు కౌన్సిలర్‌ గతంలో మృతి చెందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 11 మంది, బీజేపీకి ఒకరు మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ కు చెందిన 21 మంది రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Spread the love