సమాజంలో గురువుల పాత్ర-ఒక విశ్లేషణ

గురువు విజ్ఞానులను రూపొందిస్తాడు. తమ విద్య ద్వారా వాళ్ళను స్వయం పోషకులను చేస్తాడు. వాళ్ళలో అవగుణాలను నశింపజేసుకో గల్గిన విచక్షణా జ్ఞానాన్ని నింపుతాడు. అలా త్రిమూర్తుల కర్తవ్యాలను ఒక్క గురువే నిర్వహిస్తుంటాడు! అందుకే గురువునంతగా గౌరవించింది సమాజం! గురువుల్లో అలాంటి పాత్రను సమర్థవంతంగా నిర్వహించిన మహోన్నత వ్యక్తిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను గుర్తించింది దేశం. ఉన్నత విద్యావంతుడిగా, లెక్చరర్‌, ప్రొఫెసర్‌, వైస్‌ ఛాన్సలర్‌, విదేశీ రాయభారి, రాష్ట్రపతిగా భారతదేశానికి విశిష్టసేవలందించాడు! పలు వ్యాసాలు, ప్రసంగాలు, గ్రంథాల ద్వారా ‘భారతీయ తత్వశాస్త్రానికి ప్రపంచ ఖ్యాతి నార్జించాడు! ”సంకుచితత్వం నుండి విశాలతత్వానికి, మానవ స్థాయి నుండి అతీత స్థానానికి ఎదగాలన్న కాంక్ష, మనిషి స్వభావంలోనే నిక్షిప్తమై, అదే అతని గమ్యమన్న భావన మనిషిని నడిపిస్తున్నది!” అని సహేతుకంగా నిరూపిస్తూ ”భావ వాది జీవిత దృక్పథం’ గ్రంథాన్ని అందించిన మానవ మహోపకారి రాధాకృష్ణన్‌! అందుకే ఆయన జన్మదినం 1988 సెప్టెంబరు 5ను గురు పూజోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
మనిషి ఆధునిక సమాజంలోకి అడుగుపెట్టాక విద్య దాని ప్రాముఖ్యతను చాటింది. మనిషి వ్యవసాయం నేర్చి, స్థిర నివాసి అయ్యాక అనేక వస్తువుల అవసరత ఏర్పడింది! ఉదాహరణకు పొలం పనికి నాగలి, పలుగు, పార, కొడవలి, గొడ్డలి, ఇంటికి తలుపు, తాళం, కళ్ళెం, గొళ్ళెం, కంచం, మంచం, కప్పు, చెప్పు, తట్ట, బుట్ట వగైరాలు! వీటన్నిటితోనే ఎవరికి వాళ్లు రూపొందిం చుకోలేరు గనుక, గ్రామస్తులంతా బృందాలుగా ఏర్పడి ఆయా పనులను పంచుకున్నారిలా… గ్రామంలో సగంమంది సేద్యం చేసి ధాన్యం పండించటానికి అలా వ్యవసాయ పరికరాల తయారీ, కుండలు, బట్టలు, చెప్పులు వగైరాల ఉత్పత్తి కార్యక్రమాలను ఒక్కో బృందం చేపట్టింది. అందరి ఉత్పత్తులను గ్రామస్తులందరూ పంచుకుంటూ తమ అవసరలను తీర్చుకునేవారు. అలా ప్రతి గ్రామమూ మరో గ్రామంపై ఆధార పడకుండా జీవించేవారు. అందుకే దీనిని ”గ్రామీణ స్వయం పోషక ఆర్థిక విధానం”మన్నారు ‘కారల్‌మార్క్స్‌’.
ఆయా వస్తూత్పత్తి లో పగలంతా శ్రమించి, రాత్రికాగానే నిద్రపోయే వారు గ్రామస్తులు. మరి వాళ్ళ పిల్లలకు చదువు, సంస్కారం నేర్పి ప్రయోజకుల్ని చేసేదెవరు? అందుకని గ్రామస్తులంతా సమావేశమై గ్రామంలో కెల్లా తెలివి, జ్ఞానం, అనుభవం, శీలం గలవారిని గుర్తించి వారిలో అత్యుత్తముని తమ గ్రామానికి గురువు (పెద్ద)గా నియమించు కున్నారు. బాల బాలికలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యతను అతనిక్పగించారు. ఆయన నిరంతరం అదే పనిలో లీనమయ్యేవారు. పోషణను సమిష్టి బాధ్యతగా స్వీకరించింది గ్రామం! ‘ప్రేమ, కరుణ, క్షమ, పరోపకారం వంటి మానవీయ విలువలను, నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం వంటి నైతిక విలువలను కూడ, కథలు, పాటలు, నాటికల రూపంలో ప్రబోధిస్తూ స్వీయ, సామాజిక ప్రయోజకులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతుండేవాడు గురువు! కేవలం విద్యాబోధనకే కాక, ఖాళీ సమయంలో గ్రామీణులకు మెళుకువలు నేర్పుతో, వాళ్ళ అధికోత్పత్తులకు తోడ్ప డుతుండేవాడు! ముందుగా ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాలను గుర్తించి, గ్రామస్తులను హెచ్చరిస్తుండేవాడు. ప్రజల, పశువుల అనారోగ్యాలకు పరిష్కా రాలను సూచిస్తూ గ్రామ క్షేమానికి తోత్పడుతుండేవాడు! అందుకే నాడు గురువును, దైవ సమానునిగా భావించి, తమ తమ ఉత్పత్తులలో మేలైన వాటిని, ముందుగా గురువుకే సమర్పించుకునే వారు ప్రజలు! పరిణామ క్రమంలో గురుకులాలు, పాఠశాలలుగా గురువులు ప్రభుత్వోద్యోగులుగా మారారు.
ఉదారవాద ఆర్థిక విధానాల పుణ్యాన ‘ఉన్నది అమ్ముకో, లేనిది కొనుక్కో’మనే వ్యాపార వ్యవస్థగా మారింది సమాజం! తక్షణ లాభాల దిశగా పెట్టుబడులను మళ్ళించి, విద్యారంగానికి నిధులను కుదించారు పాలకులు! అయితే అక్కడక్కడ కొంతమంది సామాజిక స్పృహను విస్మరిస్తున్నారనే విమర్శ వస్తోంది. ఉదాహరణకు యూపీలోని ముజఫర్‌నగర్‌లోని ఖుబ్బాపూర్‌లో నేహా పబ్లిక్‌ పాఠశాలలో ఎక్కాలు సరిగ్గా అప్పగించలేదని రెండో తరగతిలో ఓ ముస్లిం బాలుడిని తోటి హిందూ బాలురతో రెచ్చగొట్టి మరీ కొట్టించిన ఉపాధ్యాయిని త్రిప్తా త్యాగి దుష్కత్యం క్షమించరానిది. పదే పదే కొట్టించటం ఒక్కటే కాదు. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ముస్లిం పిల్లలు బాగా చదవరని, వారి తల్లులు అసలు పట్టించుకోరని ఇష్టారీతిన ఆమె వ్యాఖ్యానించటం- పిల్లల హదయాల్లో మత వివక్షను నాటడమే అవుతుంది. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల ప్రజలకు, వాళ్ళకు మధ్య గల ప్రేమ, గౌరవాభిమానాలు ఆవిరైపోతున్నాయి! ఈ రోజు దేశం ఇంతటి అభివృద్ధిని సాధిస్తుందంటే కారణం కచ్చితంగా సమాజ నిర్మాతలైన ఉపాధ్యాయులే. కానీ అక్కడక్కడ వీరి ప్రవర్తన పసి పిల్లల్లో విద్వేషాలకు భీజం వేస్తున్నది.ఈ ధోరణి పూర్తిగా మారాల్సిన అవసరం కొన్ని ఘటనలు నొక్కి చెబుతున్నాయి.
విద్యా వ్యాపారంగా మారిపోవటానికి వ్యవస్థ ప్రభావమే కారణమన్నది కొంతమేరకు నిజమే! కానీ దయచేసి అందరిలాగే ఈ వ్యాపార ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉపాధ్యాయులు నిలదొక్కుకోవాలి. ఎందుకంటే డాక్టరు తప్పుకు పేషెంట్‌, ఇంజనీరు తప్పుకు కట్టడం, లాయర్‌ తప్పుకు క్లైంటు, రాజకీయ నేత తప్పుకు అతని పార్టీ నష్టపోతాయి.కానీ ఉపాధ్యాయుని తప్పుకు, నిర్లక్ష్యానికీ జాతి భవితవ్యమే నాశనమవుతుందని విజ్ఞులు అంటున్నారు. అందరిలా ఆశల కోసం కాక, ఆశయాల కోసం జీవించి దారి తప్పి పతనమార్గాన కొట్టుకుపోతున్నవారిని దిశానిర్దేశం చేసి కాపాడాలి. వ్యాసమహర్షి, రాధాకృష్ణన్‌లా సరైన విద్య నందించాలి. అలా విద్యార్థులకు, సమా జానికీ గురువులుగా మంచి హితబోధకులవ్వాలి. ఈ గురు పూజోత్సవ దినాన సమాజసేవకు పాటుపడే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి శుభాకాంక్షలు! నా శుభాశీస్సులు!
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం)
– సెల్‌:98490818889
పాతూరి వెంకటేశ్వరరావు

Spread the love