వైద్యరంగంలో దేశానికే ఆదర్శం

An example for the country in the field of medicine– తొమ్మిది మెడికల్‌ కాలేజీలువర్చువల్‌ పద్దతిలోప్రారంభించారు
– ఏటా 10 వేల మంది వైద్యుల తయారీ : సీఎం కేసీఆర్‌
ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతి యేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వ కారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తెలిపారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్‌ పద్దతిలో శుక్రవారం ప్రారంభించారు. కరీంనగర్‌, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో ఈ తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ గతంలో ఐదు కాలేజీలుంటే.. ఇప్పుడు 26 మెడికల్‌ కాలేజీలకు చేరుకున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉండేటట్టుగా రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించిందని గుర్తు చేశారు.
2014లో 2,850 ఎంబీబీఎస్‌ సీట్లుండగా నేడు అది 8,515 సీట్లకు పెరిగాయని తెలిపారు. నీట్‌కు పోను 85 శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకు దక్కాలని విడుదల చేసిన జీవోపై వివాదం చెలరేగినా మంత్రి, వైద్యశాఖ సిబ్బంది పటిష్టమైన న్యాయపోరాటం చేసి హైకోర్టులో కూడా విజయం సాధించటాన్ని అభినందించారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధక శక్తి కలిగి వుండాలంటే తెల్ల కణాలు రక్తంలో ఏ విధంగా పనిచేస్తయో , తెలంగాణ ఉత్పత్తి చేసే తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థకు కూడా అదే పద్దతిలో పని చేస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. కరోనా లాంటి వైరస్‌లు భవిష్యత్తులో వస్తే ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా, పటిష్టంగా ఉంటుందో అక్కడ తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనీ, ఎక్కడైతే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయో ఆ సమాజం ఎక్కువ నష్టపోతుందన్నారు. తెలంగాణలో 34 వైద్య కళాశాలలు అంటే 34 పెద్ద దవాఖానాలు వస్తాయని తెలిపారు. 2014లో 17 వేలున్న పడకలు 34 వేలకు చేరాయనీ, మరో ఆరు ఆస్పత్రులు, వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించుకుంటున్నామని తెలిపారు. నిమ్స్‌ పడకలను 4 వేలకు పెంచడంతో పాటు నాలుగు టిమ్స్‌ ఆస్పత్రులు రాబోతున్నాయన్నారు. 50 వేల ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉంచడంతో పాటు 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నిటి అయోగ్‌ నివేదిక ప్రకారం 2014లో వైద్యారోగ్య రంగంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రయివేటు దోపిడీ నుంచి ప్రజలను బయటపడేయాలనే ఆలోచనతోనే కేసీఆర్‌ కిట్‌ తెచ్చినట్టు సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. కేసీఆర్‌ కిట్‌ మానవీయ కోణంలో తీసుకొచ్చామని తెలిపారు. అమ్మఒడి వాహనాలతో మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భవతులు, బాలింతలకు రవాణా సౌకర్యం కల్పించబడిందని తెలిపారు. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. మాతా, శిశు మరణాలను మరింతగా తగ్గిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని వైద్య విద్యార్థులకు సూచించారు. ఏవైనా కొరతలుంటే ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదని సీఎం హామీ ఇచ్చారు. రాబోయే ఆర్థిక సంవత్సరం 2024-25లో మరో ఎనిమిది మెడికల్‌ కాలేజీలు జోగులాంబ గద్వాల, ములుగు, మెదక్‌, నారాయణపేట, వరంగల్‌(నర్సంపేట), యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పార్లమెంటులో మహిళా, బీసీ బిల్లులు పెట్టాలి
– మోడీకి కేసీఆర్‌ లేఖ
– బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీపార్టీ సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లు, 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లుల్ని పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం డిమాండ్‌ చేసింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కే చంద్రశేఖరరావు లేఖ రాయాలని నిర్ణయించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఆపార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగింది. పై అంశాలపై సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల్లో బీఆర్‌ఎస్‌ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేస్తూ మాట్లాడారు. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి వున్నదనీ, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రానికి ఎప్పటికప్పుడు తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ అంశాలను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో లేవనెత్తాలని ఎంపీలకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు.
ఈ తీర్మానం చేసి తొమ్మిదేండ్లు గడుస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటరీ ప్రత్యేక సమావేశాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలనీ, దీనిపై కూడా తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Spread the love