అనకాపల్లి ఫార్మా కంపెనీలో పేలుడు ఇద్దరు కార్మికుల దుర్మరణం

– ఐదుగురి కార్మికులకు గాయాలు
– వారిలో నలుగురి పరిస్థితి విషమం
– మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో
అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మా యూనిట్ష్‌1లో శుక్రవారం ఉదయం రియాక్టర్‌ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 28 మంది కార్మికులూ పరుగున బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. తోటి కార్మికుల కథనం ప్రకారం… సాహితీ ఫార్మాలో ఎ్షషిఫ్ట్‌లో 35 మంది పనిచేస్తున్నారు. సాల్వెంట్‌ లోడింగ్‌ సందర్భంగా ప్రొడక్షన్‌ బ్లాక్‌ వద్ద రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఏడుగురు మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జంగాలపాలేనికి చెందిన పైలా సత్తిబాబు (35), విజయనగరం జిల్లాకు చెందిన ఉప్పాడ తిరుపతిరావు (38)లను విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురిని కిమ్స్‌ ఆస్పత్రికి, ఒకరిని అచ్యుతాపురంలోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తొలుత తీసుకెళ్లారు. ఆ తర్వాత వారి ఐదుగురిని కూడా విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. వారిలో భువనేశ్వర్‌కు చెందిన రామేశ్వర్‌, అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రేబాకకు చెందిన సాగిరెడ్డి రాజబాబు, నక్కపల్లికి చెందిన శంబంగి అప్పారావు, పంచదార్లకు చెందిన సింగంశెట్టి నూకినాయుడు పరిస్థితి విషమంగా ఉంది. కొండకొప్పాకకు చెందిన తిరుపతిరావు ఐసియులో చికిత్స పొందుతున్నారు. వారిని కెజిహెచ్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియోను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
భయాందోళనలో స్థానికులు
సాహితీ ఫార్మాలో పేలుడుతో వ్యాపించిన మంటలు, పొగతో సమీప పరిశ్రమల కార్మికులు, లాలం కోడూరు, పూడిమడక గ్రామల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసినా అదుపులోకి రాలేదు. ఒక్కో రియాక్టర్‌ దశలు దశలుగా పేలుతుండడంతో సమీప ప్రాంతానికి వెళ్లి మంటలు నియంత్రించడం అగ్నిమాపక సిబ్బందికి సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఫైర్‌ నియంత్రణలో భాగంగా ట్యాంకు వాల్వ్‌ మూసివేయడానికి చేస్తున్న ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, కలెక్టర్‌ రవిపట్టాన్‌ శెట్టి, ఎస్‌పి మురళీకష్ణ, ఆర్‌డిఒ చిన్నికష్ణ తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.
ప్రమాదంపై విచారణకు కలెక్టర్‌ ఆదేశం
ఈ ప్రమాదంపై కలెక్టర్‌ రవిపట్టాన్‌ శెట్టి విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇచ్చేందుకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి నేతత్వంలో ఎఎస్‌పి, అనకాపల్లి డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ, అనకాపల్లి ఆర్‌డిఒతో కమిటీని ఏర్పాటు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి : సీపీఐ(ఎం)
సాహితీ ఫార్మాలో పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అచ్యుతాపురం, పరవాడ సెజ్‌లలోని ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నివారించే చర్యలు చేపట్టకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. పరిశ్రమలు, పని ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Spread the love