ఫాదర్‌ స్టాన్‌ స్వామి మృతిపై స్వతంత్ర దర్యాప్తు

– భారత్‌ను కోరుతూ అమెరికన్‌ కాంగ్రెస్‌లో తీర్మానం
వాషింగ్టన్‌: కస్టడీలో వుంటూ 2021 జులై 5న మరణించిన మానవ హక్కుల కార్యకర్త ఫాదర్‌ స్టాన్‌ స్వామి అరెస్టు, కారాగారవాసం, మృతిపై స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాల్సిందిగా భారత్‌ను కోరుతూ ముగ్గురు అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మానవ హక్కుల కోసం పోరాడే వారిని, రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద వ్యతిరేక చట్టాలను దుర్వినియోగం జరుగుతోందంటూ తీర్మానం ఆందోళన వెలిబుచ్చింది. వలస కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలని ఇటీవల భారత సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగ్‌ను ప్రశంసించింది. శాశ్వతంగా రద్దు చేయాలని భారత పార్లమెంట్‌కు విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్‌ సభ్యుడు జువాన్‌ వర్గాస్‌, జిమ్‌ మెక్‌ గవర్న్‌, ఆండ్రే కార్సన్‌లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాధమిక మానవ హక్కని తీర్మానం స్పష్టం చేసింది. 1948లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఆమోదించిన సార్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని 19వ అధికరణలో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. నోరు లేనివారి తరపున తన గళాన్ని వినిపించడానికే ఫాదర్‌ స్టాన్‌ తన జీవితాన్ని అంకింత చేశారని వర్గాస్‌ వ్యాఖ్యానించారు. ఆదివాసీల హక్కుల కోసం అవిశ్రాంతంగా ఆయన పోరాడారన్నారు. భారతదేశంలోని అనేక కమ్యూనిటీలకు న్యాయం కోసం ఆయన కృషి చేశారన్నారు.

Spread the love