ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చ‌క్కటి ప‌రిష్కారం

An integrated approach is the best solutionమారుతున్న జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మానసికంగా మనల్ని కుంగదీస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మనం సరైన వైద్యం చేయించుకుంటే, డాక్టర్లు సరైన వైద్యం అందిస్తే నిండు నూరేళ్లు అరోగ్యంగా ఉండొచ్చంటున్నారు ప్రముఖ హోలిస్టిక్‌ హెల్త్‌ ఫిజీషియన్‌ డా.ప్రత్యుష నేరెళ్ళ తన తల్లి ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలే ఆమెను ఇలా ఆలోచింపజేశాయి. ఈ రోజు డాక్టర్స్‌ డే సందర్భంగా ఆమె ఇస్తున్న సలహాలు, సూచనలు మానవి పాఠకులకు ప్రత్యేకం…
మా సొంతూరు నెల్లూరు. స్కూలింగ్‌, ఇంటర్‌ అక్కడే చదివాను. చిన్నప్పటి నుండి డాక్టర్‌ కావాలని కలలు కన్నాను. కర్నూల్‌ గవర్నమెంట్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. నారాయణ మెడికల్‌ కాలేజీలో ఎం.డి చేశాను. సాధారణంగా ఎం.డి తర్వాత అందరూ సూపర్‌ స్పెషలిటీ వైపు వెళతారు. కాని నేను మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాను. ఎందుకంటే మా అమ్మకు మానసిక సమస్య ఉండేది. వాటి కోసం వాడిన మందుల వల్ల షుగర్‌ కూడా వచ్చింది. షుగర్‌ కోసం డైట్‌ కంట్రోల్‌ చేయాలన్నపుడు అదంతా భరించలేక అమ్మలో ఇంకాస్త చిరాకు, కోపం, ఆందోళన పెరిగేది. దాంతో సైకాలజీకి సంబంధించిన మందుల డోస్‌ పెంచాల్సి వచ్చేది. దీని వల్ల సమస్య మరింత పెరిగిపోయింది. సమస్యకు అసలు కారణం తెలుసుకోకుంటే పరిష్కారం దొరకు. అందుకు నేను ఎం.డి తర్వాత న్యూట్రీషియన్‌, లైఫ్‌స్టైల్‌, డయాబెటిస్‌, సైకాలజీ, ప్రానిక్‌ హీలింగ్‌ ఇలా వీటన్నింటిపై అవగాహన పెంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు అన్ని రకాల సమస్యలకు చక్కని మార్గాన్ని చూపింగలనని అనిపించింది.
మల్టిబుల్‌ సమస్యలైతే…
వాస్తవానికి గతంలో మన దగ్గర వైద్యం చేయించుకునే పద్ధతి ఒకటుండేది. ఏదైనా సమస్య వస్తే ముందు జనరల్‌ ఫిజీషియన్‌ దగ్గరకు వెళ్లేవాళ్లు. తర్వాత అవసరాన్ని బట్టి వాళ్లే స్పెషలిస్ట్‌ దగ్గరకు ట్రీట్‌మెంట్‌ కోసం పంపేవారు. కానీ ఇప్పుడు ఈ పద్ధతిలో మార్పు వచ్చింది. శరీంలో ఏ భాగానికి సమస్య వస్తే ఆ స్పెషలిస్ట్‌ దగ్గరకు పరిగెడుతున్నాం. ఒకే సమస్య వస్తే అలా వెళ్ళినా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ మనలో మల్టిబుల్‌ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా ముందు జనరల్‌ ఫిజీషియన్‌ దగ్గరకు వెళ్ళడమే మంచిది. వాళ్లు అన్ని విధాలుగా ఆలోచించి చక్కని సూచనలిస్తారు. దీనివల్ల సమసయకు సరైన పరిష్కారం దొరుకుతుంది.
మెదడు కూడా ఉంటుంది
శరీరంలో చాలా సమస్యలకు ముఖ్య కారణం మానసిక ఆందోళన. దీన్ని ముందు కంట్రోల్‌ చేయగలిగే శరీరంలోని సమస్యను కచ్చితంగా పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే మానవ శరీరంలో కేవలం శరీర భాగాలు మాత్రమే ఉండవు. అన్నింటికీ స్పందించే మెదడు కూడా ఉంటుంది. దీన్ని చాలా మంది మర్చిపోతున్నారు. మా అమ్మ విషయంలో నేను ఈ సమస్యను చూశాను. వాస్తవానికి ఓ జనరల్‌ ఫిజీషియన్‌, ఓ సైకాలజిస్ట్‌, ఓ న్యూట్రీషియన్‌ కలిసి వర్క్‌ చేసినప్పుడు పేషంట్‌ సమస్యను త్వరగా పరిష్కరించవచ్చు. ఇందంతా దృష్టిలో పెట్టుకొనే నేను మల్టిబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను.
సమస్య మూలల్లోకి వెళ్లి
మల్టిబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో మేము పేషంట్‌ వచ్చినప్పుడు సమస్య మూలాల్లోకి వెళతాం. ముందుగా క్లీనికల్‌ ఎగ్జామినేషన్‌, హిస్టరీ, బ్లడ్‌ వర్క్‌ అప్‌ చేయడం, సస్యలను గుర్తించడం, డైట్‌ చెప్పడం, సైకాలజిస్ట్‌ సమస్య ఏదైనా ఉంది అనిపిస్తే కౌన్సెలింగ్‌ చేస్తాము. మా దగ్గరకు వచ్చే వారిలో ఎక్కువగా చాలా రోజుల నుండి మందులు వాడుతున్నా సమస్య పరిష్కారం కాని వారు, రిపోర్ట్స్‌ అన్నీ నార్మల్‌గా ఉన్నా శరీరంలో ఏదో ఒక బాధ ఉన్న వారు ఉంటారు. అలాంటి వారికి అవసరమైన ట్రీట్‌మెంట్‌ చేస్తాం. ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌లో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తుంటాం. తర్వాత కాలంలో వాళ్లు మందులు ఆపేసి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. మెడిసన్‌ వాడినా పరిష్కారం రాని వారికి అదే మెడిసెన్‌తో పరిష్కారం వచ్చేలా చేస్తాం. అంటే ఈ అప్రోచ్‌లో మేము వాళ్లలో పాజిటివ్‌ ధోరణిని అభివృద్ధి చేస్తాం. అందుకే మంచి ఫలితాలు వస్తున్నాయి.
ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే…
ఇంటి గ్రేటెడ్‌ అప్రోచ్‌ మన దేశంలో ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. భవిష్యత్‌లో ఇది మరింత విస్తృతం కావాలి. ఈ పద్ధతి విదేశాల్లో ఎప్పటి నుండో కొనసాగుతుంది. అక్కడ ఏదైనా సమస్య వస్తే ముందు కచ్చితంగా జనరల్‌ ఫిజీషియన్‌ను కలవాలి. లేదంటే స్పెషలిస్ట్‌ ట్రీట్‌మెంట్‌ చేయరు. మన దగ్గరకు కూడా ఇలా చేస్తే ప్రజలకు చాలా ఉపయోగం. ఇది ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. ఎంబీబీఎస్‌ చదివేటప్పుడే స్టూడెంట్‌కి ఇవన్నీ నేర్పించాలి. వైద్యం అంటే కేవలం శరీరభాగాలకు మాత్రమే కాదు రోగి మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకొని చికిత్స చేయాలి. అవసరమైన కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. దీని గురించి ప్రభుత్వం మరింత బాధ్యత తీసుకుంటే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఇవన్నీ స్కూల్‌ పిల్లల పాఠ్యాంశాల్లో కూడా భాగమైతే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
కమ్యూనికేషన్‌ చాలా ముఖ్యం
ఒక పేషంట్‌ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఏం అవసరమో అది చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. మారుతున్న జీవనశైలి వల్ల ప్రతి ఒక్కరికీ ఆందోళన, నిద్రలేమి ఉంటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటికి ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌ వల్ల సరైన పరిష్కారం దొరుకుతుంది. లైఫ్‌స్టైల్‌ డిసీసెస్‌కి డైట్‌ ఫాలో అవ్వాలి అని అందరికీ తెలుసు. ఎందుకు కచ్చితంగా ఫాలో అవ్వాలి అనేది ఈ కౌన్సెలింగ్‌లో ఇస్తాం. అప్పుడే వాళ్లు పాటిస్తారు. సమస్య పరిష్కారమవుతుంది.
మహిళలకు సూచన…
మహిళల ఆరోగ్యానికి ముఖ్యమైన సూచన ఏమిటంటే సాధారణంగా మహిళలకు బాధ, జాలి, దయ, సంతోషంగా ఇలా అన్నీ ఎక్కువే. ఇలా ఉంటేనే పిల్లల్ని ఆరోగ్యంగా పెంచగలుగుతారు. ఈ లక్షణాలే ఆమెలోని బలాలు. అయితే ఈ ఫీలింగ్స్‌ వల్ల మహిళలు ప్రతి విషయంలో చాలా త్వరగా స్పందిస్తుంటారు. దీని వల్ల చాలా మంది ఆమె ఊరికే ఏడుస్తుంది, చిరాకు పడుతుంది, బాధపడుతుంది అంటుంటారు. ఆమెకు ఆ ఫీలింగ్స్‌ ఉన్నాయి కాబట్టే కుటుంబాన్ని చక్కగా చూసుకోగలుగుతుంది అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఆమెను ఆమెగా స్వీకరించాలి. అప్పుడు మహిళలు ఆరోగ్యంగా, ధైర్యంగా ఉండగలుగుతారు. ఆమె ఏదైనా విషయం చెప్తుంటే ప్రశాంతంగా కూర్చొని వినాలి. అప్పుడు సగం సమస్య పరిష్కారమవుతుంది. మహిళలు కూడా వారి భావోద్వేగాలను అర్థం చేసుకొని, నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. అవసరమైనప్పుడు ప్రొఫెషనల్‌ హెల్ప్‌ తీసుకోవాలి. ఎమోషనల్‌గా, ఎకనామికల్‌గా ఇండిపెండెంట్‌ అయినపుడు మహిళలు పూర్తిగా వారి కాళ్ళపై వాళ్లు నిలబడగలుగుతారు.
కారణం మానసిక సమస్యలే
చిన్నప్పటి నుండి అందరూ నాలో సైకాలజిస్ట్‌ అయ్యే లక్షణాలు బాగా ఉన్నాయి అనేవారు. ఆ మాటలు కూడా నాలో ఆసక్తిని పెంచాయి. నా అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే నేటి బిజీ జీవితంలో మనకు వచ్చే ఎన్నో జబ్బులకు ముఖ్య కారణం మానసిక సమస్యలే. ఏదైనా ఒక దానిపైనే స్పెషలైజేషన్‌ చేస్తే శరీరంలో ఒక్క భాగం గురించి మాత్రమే అవగాహన ఉంటుంది. అదే జనరల్‌ ఫిజీషియన్‌ అయితే శరీరం మొత్తంపై పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. దాని వల్ల సమస్యకు కారణం ఏంటీ అనేది రకరకాల యాంగిల్స్‌లో ఆలోచించవచ్చు. ఇలా కేవలం జనరల్‌ ఫిజీషియన్‌ మాత్రమే ఆలోచించగలరు. అసలు కారణం తెలుసుకొని సంబంధింత స్పెషలిస్ట్‌ వద్దకు రిఫర్‌ చేస్తారు.
– సలీమ

Spread the love