అప్రకటిత ఎమర్జెన్సీయే..

– అందులో భాగమే ప్రతిపక్ష నేతలు, మీడియాపై నిఘా
– మోడీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు
– సంయుక్త కిసాన్‌ మోర్చా ఖండన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీలో భాగమే ప్రతిపక్ష నేతలు, మీడియాపై ప్రభుత్వం నిఘా పెట్టిందని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) విమర్శించింది. మోడీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు చేపట్టిందని దుయ్యబట్టింది. ఈ మేరకు బుధవారం ఎస్‌కెఎం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిపక్ష నాయకులు, మీడియా ప్రతినిధులపై నిఘా గురించి ఆపిల్‌ ఐ ఫోన్‌ జారీ చేసిన హెచ్చరిక నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంకుశ, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేసిందని పేర్కొంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, పార్ట్‌ ..3 కింద పౌరులందరి గోప్యత, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను వెల్లడిస్తుందని తెలిపింది.
నేరారోపణ చేయడానికి కొన్ని తప్పుడు సమాచారాలను రిమోట్‌గా నాటాలనే ఉద్దేశ్యంతో ఏ పౌరుడి మొబైల్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ వంటి ఇతర పరికరాలను రిమోట్‌గా యాక్సెస్‌ చేసే నిఘా ప్రజాస్వామ్య సమాజంలో అంగీకరించబడదని పేర్కొంది. ఆపిల్‌ ఐఫోన్‌ తన వినియోగదారులకు ప్రభుత్వ ప్రేరేపిత దాడి గురించి హెచ్చరించి ఇలాంటి నోటిఫికేషన్‌లను పంపడం ఇది రెండోసారని తెలిపింది. 2021లో ఆపిల్‌, గూగుల్‌ రెండూ ఇజ్రాయెలీ కంపెనీ ఎన్‌ఎస్‌ఓచే తయారు చేయబడిన స్పైవేర్‌ అయిన పెగాసస్‌ చేసిన దాడికి వ్యతిరేకంగా హెచ్చరికను పంపాయని గుర్తు చేసింది. ఈ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి ప్రభుత్వం సహకరించడానికి నిరాకరించిందని పేర్కొంది.
ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పాలనలో ఇలాంటి చర్యలు కొత్తేమీ కాదని, కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడమే హౌం మంత్రిత్వ శాఖ అనాలోచిత పనులను బయటపెట్టడానికి సరిపోతుందని ధ్వజమెత్తింది. ఈ ప్రభుత్వం చేసే చర్యల్లో న్యూస్‌క్లిక్‌పై తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ తో మీడియా స్వేచ్ఛాపై దాడి, అమాయక జర్నలిస్టులను జైళ్లలో పెట్టేందుకు యూఏపీఏను దుర్వినియోగం చేయడం, రైతుల ఉద్యమాన్ని దేశ వ్యతిరేకమని ప్రచారం చేయడం, విదేశీ, ఉగ్రవాద శక్తులు నిధులు సమకూర్చడమంటూ ప్రచారం, అసమ్మతిని అణచివేసే నీచమైన మార్గాలకు తాజా ఉదాహరణలని పేర్కొంది.
దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ విధించినందుకు ప్రధానమంత్రి, హౌంమంత్రి చర్యలను ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. కష్టపడి సాధించుకున్న తమ ప్రజాస్వామ్య హక్కులపై ఎలాంటి దాడి జరిగినా వదిలేది లేదని, ఇది గతంలో చాలాసార్లు రుజువైందని, ఈసారి కూడా ప్రజలే గెలుస్తారని తెలిపింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలనను బట్టబయలు చేసేందుకు పోరాటమే ఏకైక మార్గమని, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి తమ డిమాండ్లపై పోరాటాలు నిర్మించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది.

Spread the love