అధికారుల అరాచకం..

Anarchy of officials..– అర్ధరాత్రి పేదల గుడిసెలు తొలగింపు
– నష్టపోయాం.. న్యాయం చేయండి : గుడిసె వాసుల ఆందోళన
నవతెలంగాణ-కాశిబుగ్గ
సొంత ఇల్లు లేక, ఇంటి కిరాయి కట్టలేక ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడంతో నిలువ నీడ లేక గుడిసెవాసుల పరిస్థితి దయనీయంగా మారింది. వరంగల్‌ నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువు సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు గురువారం తెల్లవారుజామున నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. సుమారు రెండేండ్ల కిందట ఎంహెచ్‌నగర్‌-2 పేరుతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 1600మంది పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇండ్లలోకి నీరు రావడంతో గుడిసెవాసులు పగలు మాత్రమే ఉంటున్నారు. కొంతమంది ఇటీవల రూ.20వేల నుంచి రూ.30వేలు ఖర్చుపెట్టి మొరం పోయించుకున్నారు. కాగా, గురువారం తెల్లవారుజామున వరంగల్‌ ఏసీపీ బోనాల కిషన్‌ ఆధ్వర్యంలో ఇంతేజర్‌గంజ్‌, మట్టేవాడ, ఏనుమాముల, మిల్స్‌ కాలనీ పోలీసులు సుమారు 100 మంది వరకు భారీగా మోహరించగా మున్సిపల్‌ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో జేసీబీలతో మొత్తం గుడిసెలను తొలగించి ఇంటి సామాను, రేకులు, కర్రలను ట్రాక్టర్‌ డీసీఎంల ద్వారా భద్రకాళి చెరువు సమీపంలోని పోతననగర్‌ వద్ద పడేశారు. విషయం తెలుసుకొని అడ్డకొనేందుకు అక్కడికి చేరుకున్న స్థానిక సీపీఐ(ఎం) నాయకులు బషీర్‌, సురేష్‌, కల్పన, రమ, తదితర నాయలకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. కిరాయి బాధ భరించలేక, సొంత ఇల్లు లేక 18నెలల కింద ఇక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నామని తెలపారు. గుడిసెల కోసం పనులు వదులుకొని ఉంటున్నామని, ఇప్పుడు అధికారులు తమ గుడిసెలను కూల్చడంతో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి గుడిసెలు వేసుకున్నామని, వర్షాలతో ఇండ్లలోకి నీరు చేరడంతో రాత్రి పూట తెలిసిన వారి ఇండ్లలో పొడుకుంటున్నామని తెలిపారు. ఇలా ఇండ్లలో ఎవరూ లేని సమయంలో దొంగల్లా గుడిసెలు కూల్చి సామన్లు నేలమట్టం చేయడం దారుణమని, దాదాపు ఒక్కొక్కరం రూ. లక్ష వరకూ నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అర్ధరాత్రి గుడిసెలు కూల్చడాన్ని నిరసిస్తూ పోచమ్మ మైదాన్‌ సెంటర్‌లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రంగయ్య మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు పట్టాలిచ్చి, పక్క గృహాలు కట్టించకపోగా వారు వేసుకున్న గుడిసెలను తొలగించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలను సర్వే చేసి అర్హులైన పేదలకు పట్టాలిచ్చి పక్కా గృహాలు కట్టించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పేదలందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Spread the love