ఆరు గ్యారంటీలతో అందలం.. ఆరు నెలల్లోనే వక్రబుద్ధి బహిర్గతం

ఆరు గ్యారంటీలతో అందలం.. ఆరు నెలల్లోనే వక్రబుద్ధి బహిర్గతం– మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
– అభ్యర్థుల గుణగణాలను పరిశీలించండి : ఎంపీ నామ
– మంచి వ్యక్తులను ఎన్నుకునే సంప్రదాయం : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి
– పట్టభద్రులారా మీ ఓటు వృధా కానీయొద్దు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
నవతెలంగాణ-సత్తుపల్లి
ఆరు గ్యారంటీ పథకాలతో అందలమెక్కిన కాంగ్రెస్‌ పార్టీ నిజస్వరూపం ఆరు నెలల్లోనే బహిర్గతమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్‌, పాలేరు నియోజకవర్గంలోని బారుగూడెం గ్రామం, సత్తుపల్లి మండలంలోని ఎంఆర్‌ గార్డెన్‌లో పట్టభద్రులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ అందరిని మోసం చేసిందన్నారు. గులాబీ జెండా పుట్టిన కాడ్నుంచి ఈ సీటు బీఆర్‌ఎస్‌దేనన్నారు. ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆషామాషీ కావని, ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యతు బాగుండాలని కోరుకొనే ఎన్నికలని తెలిపారు. ఇంతకు ముందు ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి పట్టభద్రుల కోసం నిరంతరం పనిచేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిప ˜ికేషన్‌ను కూడా వేయలేక పోయారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడేమో ఆ హామీ ఇవ్వలేదని బుకాయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవకపోయినా వారికి ఏ ఢోకా ఉండదని, ఒకవేళ కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే పట్టభద్రుల పక్షాన మాట్లాడే అవకాశం ఉండదన్నారు. అదే రాకేశ్‌రెడ్డిని గెలిపిస్తే.. అందరి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము అతనికి ఉందన్నారు.ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎవరి గుణం ఎలాంటిదో అందరికి తెలిసిందేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఎవరికి ఓటెయ్యాలో విజ్ఞులైన పట్టభద్రులు నిర్ణయించుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ .. మీడియాను అడ్డం పెట్టుకొని బ్లాక్‌ మెయిల్‌ చేసే వ్యక్తికి ఓటెయ్యాలా, నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తికి ఓటెయ్యాలా అనే అంశాన్ని పరిగణన లోకి తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తులను ఎన్నుకొనే సంప్రదాయం మనకున్నదని, ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని పట్టభద్రులను కోరారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడు తూ.. రాకేశ్‌రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా పేద బిడ్డల భవిష్యతు గొప్పగా మారే అవకాశం ఉంటుం దన్నారు. మీ ఓటు వృధా కాకుండా మొదటి ప్రాధాన్యత ఓటును 3వ నెంబరులో ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి వేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐదు మండలాల నుంచి బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Spread the love