ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలి

ANMs should be regularized– కోఠి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయం వద్ద ధర్నా
– భారీగా పోలీసుల మోహరింపు, అరెస్టు
– నేడు పీహెచ్‌సీల ఎదుట నిరసనలకు పిలుపు
నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌
కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని, రాత పరీక్ష రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ‘సీఐటీయూ) యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కోఠి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. వివిధ జిల్లాల నుంచి ఏఎన్‌ఎంలు పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసులు భారీగా మోహరించి వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్టు చేశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆవరణ పోలీసులతో నిండిపోయింది. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను అరెస్టు చేసి అంబర్‌పేట్‌, లాలాగూడ, అఫ్జల్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అరెస్టు అయిన వారిలో యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌, అధ్యక్షులు ఎండీ పసియోద్దీన్‌, హైదరాబాద్‌ నగర అధ్యక్షులు జె.కుమార్‌ స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్మయి, వివిధ జిల్లాల నాయకులు మంగా, లక్ష్మీబాయి,రమా, షీలా, భవాని, ధనలక్ష్మి, రాజేశ్వరి, బాలమణి, దైవమని తదితరులున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ధర్నాకు కూడా అనుమతించకపోవడం దుర్మార్గం అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కమిటీ వేసింది.. నెల రోజులు అయినా ఫలితం లేదన్నారు. రెగ్యులర్‌ కాలేదు, పరీక్ష రద్దు కాలేదన్నారు. ఏరియర్స్‌ ఇవ్వలేదని చెప్పారు. సమ్మె కాలం వేతనాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల ఎదుట దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Spread the love