హనుమంతు ముదిరాజ్ హెచ్చరిక
ముందు ఎన్నికలు నిర్వహిస్తే.. కాలయాపన జరుగుతుందని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయకుంటే మరోసారి సమ్మె తప్పదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని బస్సుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై నిరవధిక నిరాహారదీక్ష చేస్తుంటే పోలీసులు దీక్షను భగ్నంచేయడాన్ని ఖండించారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లోనూ దీక్ష చేస్తుండగా సాయంత్రం ఐదు తర్వాత దీక్ష విరమించాలని ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత చికిత్స పేరుతో గాంధీ ఆసుపత్రికి పంపించి అడ్మిట్ చేయకుండా కాలయాపన చేసి రాత్రి ఒంటిగంట వరకు వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను బస్‌భవన్ వద్ద నా దీక్ష కొనసాగిస్తానని పట్టు పట్టడంతో మళ్లీ గురువారం కూడా పోలీసులను మోహరించారని వివరించారు. పోలీసులతో బెదిరిస్తే సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ తేదీని వెంటనే ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే మరో రెండు సంవత్సరాలు ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదనీ, కాలయాపన అవుతుందన్నారు. ప్రభుత్వం అప్రతిష్టపాలు కాకుండా విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ముందుగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయకుంటే తిరిగి సమ్మె చేస్తామని ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సోములయ్య, వైస్ ప్రెసిడెంట్ గోలి రవీందర్. కోశాధికారి పిఎస్ఎస్ రావు, కార్యదర్శి జీవన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరేందర్, సిటీ రీజినల్ సెక్రెటరీ బుల్లెట్ పాండు, మెహిదీపట్నం చైర్మెన్ యూకూబ్ ఖాన్, ఫలక్నామా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్, వనపర్తి డిపో సెక్రటరీ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుంటే మరోమారు సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



