Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహాత్మా జ్యోతిరావు గురుకుల పాఠశాలల పేరు మార్పు

మహాత్మా జ్యోతిరావు గురుకుల పాఠశాలల పేరు మార్పు

- Advertisement -

తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ ఎంజేపీ విద్యా సంస్థల సొసైటీ నిర్ణయం
ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
-బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక తీర్మానాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహాత్మా జ్యోతిరావు గురుకుల పాఠశాలల పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థల సొసైటీ’గా వాటికి నామకరణం చేసింది. ఈ మేరకు సొసైటీ ఆరో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం తీర్మానించింది. గురువారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ప్రాంతీయ సమన్వయ కార్యాలయాల వివిధ విభాగాలకు బడ్జెట్ పరిమితులను బోర్డు ఆమోదించింది. ఎంజేపీ బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు మరణించిన సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిన్సిపాల్ (పాఠశాల) నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న 70 శాతం పదోన్నతులు, 30 శాతం ప్రత్యక్ష నియామకాల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి కేవలం ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

విద్యా పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాళ్లను అకడమిక్ కన్సల్టెంట్ వినియోగించుకునే అంశంపై నియామక నిబంధనలను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఐఐటీలు, ఐఐఐటీలు, ఎన్ఐటీలు వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాలని బోర్డు నిర్ణయించింది. ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ల కొనుగోలు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరాకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 12 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఆమోద స్థితిపై పూర్తి నివేదిక సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాలమాయాదేవి, ఎంజేపీ బీసీ గురుకులాల కార్యదర్శి సైదులు, వివిధ విభాగాల అధికారులు, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -