మరో రైల్లో మంటలు.. 21 మందికి గాయాలు

నవతెలంగాణ హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా (Etawah) జిల్లాలో ఢిల్లీ నుంచి బిహార్‌ వెళ్తున్న ఢిల్లీ- దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అదే జిల్లాలో మరో రైల్లో మంటలు కలకలం రేపాయి. ఢిల్లీ నుంచి బిహార్‌లోని సహర్సా వెళ్తోన్న వైశాలి ఎక్స్‌ప్రెస్‌ (Vaishali Express)లోని ఎస్‌-6 బోగీ కాలిపోయింది. గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో.. మొత్తం 21 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎస్-6 కోచ్‌లోని మంటలను ఆర్పేశారని పోలీసులు తెలిపారు. 21మంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించినట్టు వెల్లడించారు. గాయపడిన ప్రయాణికుల్లో 13 మందిని సైఫాయ్‌లోని ఆస్పత్రిలో చేర్చగా, ఏడుగురు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఒక ప్రయాణికుడిని డిశ్ఛార్జి చేసినట్టు వెల్లడించారు.
అంతకుముందు.. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బిహార్‌ వెళ్తున్న ఢిల్లీ- దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌-1 కోచ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 బోగీలు దగ్ధమయ్యాయి. ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన లోకో పైలట్‌ రైలును నిలిపేశారు. అధికారులకు సమాచారమివ్వడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Spread the love