నవతెలంగాణ – జార్జ్‌టౌన్: దక్షిణ అమెరికాలోని గయానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఓ పాఠశాల వసతిగృహంలో సంభవించిన అగ్నిప్రమాదంలో దాదాపు 20 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. రాజధాని జార్జ్‌టౌన్‌కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహ్‌దియా పట్టణంలోని ఓ సెకండరీ స్కూల్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. పాఠశాల వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. బాధితులంతా 12- 18 ఏళ్ల పిల్లలేనని, ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇదొక భారీ ప్రమాదం. బాధాకరమైనది’ అని పేర్కొన్నారు. బాధితులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనేక మంది విద్యార్థులు స్థానికంగా చికిత్స పొందుతున్నారని, ఏడుగురిని రాజధానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలకుగానూ ప్రభుత్వం.. ప్రైవేటు, మిలిటరీ విమానాలను రంగంలోకి దించింది. బాలికల వసతి గృహంలో మంటలు చెలరేగినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలను నివారించేందుకుగానూ.. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని స్థానిక విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.