ఏపీ సైకిల్‌దే..

AP Cycle..– జనసేన, బీజేపీతో కలిసి ఘనవిజయం
– అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి వాత
– సీఎం జగన్‌ రాజీనామా
– నేడు ఢిల్లీకి చంద్రబాబు
– ఎన్డీయే కూటమితో భేటీ
– ఇక జాతీయ రాజకీయాల్లోనూ కీలకపాత్ర
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. జనసేన, బీజేపీతో కలిసి అసెంబ్లీతోపాటు లోక్‌సభ సమరం లోనూ విజయఢంకా మోగించింది. అధికార వైసీపీని సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేస్తూ అప్రతిహాతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం గత ఆరు నెలలుగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పడిన కష్టం ఎట్టకేలకు ఫలితాలను ఇచ్చింది. అలాగే బీజేపీ సైతం అనూహ్యమైన ఫలితాలు సాధించడానికి వారిద్దరూ తోడ్పడ్డారు. ఏపీలో గెలిచిన సీట్లు ఇప్పుడు ఢిల్లీ ప్రధాని పీఠంపై మోడీ కూర్చోవడానికి సైతం ఉపయోగ పడుతుండటం గమనార్హం. సొంత మెజారిటీ సాధించలేకపోయినా బీజేపీ టీడీపీపై ఆధార పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం గమనార్హం. ఏపీలో తెలుగుదేశం 135 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు 88 సీట్లు అవసరం కాగా, మూడు పార్టీలు కలిసి ఆ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేశాయి. టీడీపీకి సొంతంగా కూడా మెజారిటీ సమకూరింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం, లోకేష్‌ మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబు 47 వేలకుపైగా ఓట్లతో విజయం సాదించారు. బాలకృష్ణ హిందూపురం నుంచి హాట్రిక్‌ సాధించారు. గతంలో టీడీపీ గెలవని మంగళగిరి స్థానం నుంచి లోకేష్‌ పోటీచేసీ గెలవడం చర్చనీయాంశమైంది. 39 ఏండ్ల తర్వాత అక్కడ పసుపు జెండా ఎగురవేశారు. 1985లో టీడీపీ నుంచి కోటేశ్వరరావు విజయం సాధించారు. ఇప్పటివరకు ఆ నియోజక వర్గంలో అత్యధిక మెజారిటీ 17,265 మాత్రమే. ఆ రికార్డును లోకేష్‌ తిరగ రాస్తూ వైసీపీ అభ్యర్థి ఎం.లావణ్యపై 91 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.
టీడీపీ జోరు
తాజా ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగిన తెలుగుదేశం సైతం సంచలన విజయాన్ని అందుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ తరహా గెలుపును టీడీపీ చవిచూడలేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 102 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ, గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఈసారీ 144 నియోజకవర్గాల్లో బరిలోకి దిగి 135 స్థానాల్లో విజయం సాధించింది. 16 ఎంపీ సీట్లనూ గెలుచుకుంది. ఇక బీజేపీ 10 స్థానాల్లో పోటీచేయగా, ఎనిమిది చోట్ల విజయం సాధించింది. మూడు లోక్‌సభ స్థానాలను సాధించింది. అలాగే ‘వై నాట్‌ 175’ అంటూ అతి చేసిన వైసీపీ 11 సీట్లకే పరిమితమైది. నాలుగు లోక్‌సభ స్థానాలనూ గెలవడం గమనార్హం. మంత్రులంతా ఓటమి పాలు కావడం తెలిసిందే. తాను తప్ప రాష్ట్రంలోని ఓడిపోతామనుకున్న ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినా జగన్‌కు విజయం దక్కలేదు. సిద్ధం పేరుతో చేపట్టిన ప్రచారం కార్యక్రమమూ బెడిసికొట్టింది.
జనసేన
జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచింది. దీంతో 100 శాతం స్ట్రైక్‌ రేట్‌ను నమోదుచేసినట్టయింది. జనసేనాని పవణ్‌కళ్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మొదటి నుంచి జాగ్రత్తపడ్డారు. సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రులతో కలివిడిగా ఉన్నారు. తొలుత 24 సీట్లకు అభ్యర్థులను ప్రక టించి, ఆనక 21 సీట్లలో పోటీకి దించి కూటమి ధర్మాన్ని పాటించారు. పవణ్‌కళ్యాణ్‌ పదేండ్ల రాజ కీయ ప్రస్తానంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 2019లో కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ, ఈసారీ ఏకంగా పోటీ చేసిన అన్ని చోట్లా విజయం సాధించడం గమనార్హం.
చంద్రబాబు, పవన్‌ భేటీ
ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో తెలుగుదేశం అధినేత చంద్ర బాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును పవన్‌కళ్యాణ్‌ సాదరస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసు కున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఇరువురు నేతలు సమావేశమ య్యారు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నాహాలపై చర్చించుకున్నట్టు తెలిసింది. బుధవారం ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యే అంశంపైనా ఇరువురూ సమాలోచనలు చేసినట్టు సమాచారం. ఆ భేటీకి చంద్రబాబుతోపాటు పవన్‌కళ్యాణ్‌ కూడా వెళతారా ? లేదా ? అనేది తేలలేదు.
కూటమిదే పీఠం..నారా ఫ్యామిలీలో జోష్‌ !
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా లోకేష్‌ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్‌ చూపిస్తూ మీడియాకు ఫోజులిచ్చారు. కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌భవన్‌కు చంద్రబాబు చేరుకు న్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసు కున్నారు. బాణా సంచా కాల్చారు. స్వీట్లు పంచారు. డ్యాన్సులు చేశారు. వందలాది మందితో కార్యాలయం కోలాహాలంగా మారింది.
సీఎం జగన్‌ రాజీనామా
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాజీనామా లేఖను గమర్నర్‌కు పంపారు. అంతకు ముందు జగన్‌ మీడియా తో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫలితాలను తాను ఊహించలేదన్నారు. అక్క, చెల్లెమ్మల ఓట్లు, పింఛన్లు అందుకున్న అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. మంచి చేసినా ఓడించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా పులివెందుల నుంచి బరిలోకి దిగిన జగన్‌ విజయం సాధిం చారు. అయితే గతం కంటే మెజారిటీ తగ్గింది. టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవిపై జగన్‌ 61,176 ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆధిక్యం ఈసారీ 28 వేల ఓట్ల మేర తగ్గిపోయింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కడమూ కష్టమేనని అంటున్నారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
ఒక్క సీటూ గెలవని వైసీపీ
శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటూను గెలుచుకోలేకపోయింది.
హ్యాట్రిక్‌ వీరులు వీరే
టీడీపీలో పలువురు అభ్యర్థులు వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్‌, టెక్కలిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. హిందూపురంలో బాలకృష్ణ హాట్రిక్‌ సాధించారు. అలాగే వీరితోపాటు నిమ్మకాయల చినరాజప్ప(పెద్దాపురం), గొట్టిపాటి రవి(అద్దంకి), ఏలూరి సాంబశివరావు(పర్చూరు),గోరంట్ల బుచ్చయ్య చౌదరి(రాజమండ్రి రూరల్‌), నిమ్మల రామానాయుడు(పాలకొల్లు) హాట్రిక్‌ గెలుపు నమోదు చేశారు. ఇదిలావుండగా ఎంపీల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్‌ నాయుడు వరుసగా మూడోసారి విజయపతాకను ఎగురవేశారు.

Spread the love