అవన్నీ సమకూరాయా?

– సమీక్షించుకుందాం… : కవి సమ్మేళనంలో కె.ఆనందాచారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వాతంత్య్రం వస్తే లభిస్తాయనుకున్నవన్నీ సమకూరాయా? లేదా? అనే విషయాలను సమీక్షించుకోవాల్సిన అవసరముందని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి సూచిం చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ‘లౌకిక భారతం – మత సామరస్యం’ అనే అంశంపై మంగళవారం కవి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ స్వాతంత్య్రానికి 76 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంలో, విజయోత్సవం ఆనందంగా జరుపుకుంటూనే సమీక్ష జరుపుకోవడం, పున:సమీక్ష చేసుకుని కర్తవ్యాన్ని నిర్దేశించుకోవడం చాలా ముఖ్యమైన అవసరమని నొక్కి చెప్పారు. స్వాతంత్రం వస్తే లభిస్తాయనుకున్న స్వేచ్ఛ, భద్రత, ప్రజాస్వామ్యం, ఆకలి లేకపోవడం, సమానత్వం, అవసరాలు తీరడం, విద్య, వైద్యం అన్నీ సమకూరాయా? లేదా? అనే విషయాలపై ఆలోచించాలని సూచించారు.
హైదరాబాద్‌ నగర అధ్యక్షులు ఏబూషి నరసింహ మాట్లాడుతూ మణిపూర్‌ మండిపోతుంటే మన పాలకులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సమయాల్లో కవులు , రచయితలు బాధితుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలంగాణ సాహితి రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్‌ కృష్ణ, సలీమ, ప్రభాకరా చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కవి సమ్మేళనంలో తుర్లపాటి లక్ష్మి, శాంతా రావు, రామకష్ణ చంద్రమౌళి, శరత్‌ సుదర్శి, ఎం.రేఖ, మహేష్‌ దుర్గే, రాజశేఖర్‌, కౌశిక్‌, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love