డబ్బు, మందు పంచకుండా నాతో పోటీకి సిద్ధమా ?

Don't share money with me Ready to compete?– నా దగ్గర, మా పార్టీ దగ్గర పైసల్లేవు, పోరాడేశక్తి ఉంది
– ఓడినా..గెలిచినా..ప్రజా సమస్యలపై పోరాడుతూ జనం వెంటే ఉంటా
– నేను ప్రజలను నమ్ముకున్నా..వారు డబ్బును నమ్ముకున్నారు..
– సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌
నవతెలంగాణ-రామన్నపేట
‘నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, పేద ప్రజల సమస్యలపై 35 ఏండ్లుగా పోరాటం చేస్తున్నా.. నా దగ్గర, పార్టీ దగ్గర డబ్బుల్లేవు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడే సత్తువ ఉంది. డబ్బులు, మందు పంపిణీ లేకుండా నాతో పోటీకి సిద్ధమా’ అంటూ సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నీర్నెంల, లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నిదాన్‌పల్లి, తుమ్మలగూడెం, సిరిపురం, జనంపల్లి, ఇస్కిల్ల, కక్కిరేణి, ఎన్నారం, పల్లివాడ, మునిపంపుల, దుబ్బాక గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు ఎండీ జహంగీర్‌కు మంగళహారతులు ఇచ్చి, డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికలు అత్యంత కీలకమైనవని, బాగా ఆలోచన చేసి భవిష్యత్‌ తరాల క్షేమం కోసం ఓటు వేయాలని కోరారు. పార్లమెంటులో పేదల పక్షాన మాట్లాడేవారు ఎవరూ లేరని, మొత్తం 545 పార్లమెంట్‌ సభ్యుల్లో 370 మంది కోటీశ్వరులని, 306 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, 194 మంది ఎంపీల మీద హత్య, లైంగికదాడుల కేసులు ఉన్నాయని తెలిపారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అన్ని పార్టీల వారు డబ్బు సంచులతో వస్తున్నారని, పోటీ చేసిన వారందరూ డబ్బులు ఉన్నవారేనని పేదవారు డబ్బులు ఉన్నోడికి, డబ్బులు ఉన్నవారు డబ్బులు ఉన్నోడికి ఓటు వేస్తే పేదలకు ఎవరు ఓటువేయాలని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఎస్‌ఎల్బీసీ, ఉదయ సముద్రం, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, లక్ష్మాపురం ఏటి కాల్వల కోసం నిరంతరం పోరాటం చేశామని, పాదయాత్రలు చేశామని మా పోరాటాల ఫలితంగానే ఈ కాలువలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మూసీనది ప్రక్షాళన కోసం పోరాటం చేసామని, దాంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రకటించిందన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటేస్తే వారు ఎంజారు చేస్తారని, ఆస్తులు కూడా పెంచుకుంటారని విమర్శించారు. బీజేపీ గెలిస్తే అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంను రద్దుచేసి వెట్టిచాకిరి, బానిసత్వం, నియంతృత్వ రాచరిక వ్యవస్థను తీసుకొస్తారని తెలిపారు. కాలువలోకి గోదావరి నీళ్లు తేవడానికి పోరాటం అవసరమన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. జహంగీర్‌ విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేసి మచ్చలేని నాయకుడిగా ఎదిగారని తెలిపారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేసేవారు కమ్యూనిస్టులేనని, నియోజకవర్గ సమస్యలపై ఇప్పుడు పోటీలో ఉన్న ఇతర పార్టీల ఎంపీ అభ్యర్థులు తమ జహంగీర్‌తో చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ప్రచారంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల నాయకులు వనం ఉపేందర్‌, బోయిని ఆనంద్‌, మామిడి వెంకట్‌రెడ్డి, కూరేళ్ళ నర్సింహాచారి, వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్‌, మీర్‌ ఖాజాఅలీ, పీఏసీఎస్‌ వైస్‌చైర్మెన్‌ అంబటి ఉపేంద్ర రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love