గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

– కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి
నవతెలంగాణ-కరీంనగర్‌: జిల్లాలో ఈనెల 27,28వ తేదీల్లో వైభవోపేతంగా గణేష్‌ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి అన్నారు. మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ సుబ్బారాయుడుతో కలిసి వినాయక నిమజ్జనం జరిపే కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్‌, మానకొండూర్‌ చెరువులను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, లైటింగ్‌, పెద్ద క్రేన్లు, చిన్న క్రేన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, నిమజ్జనం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం, విద్యుత్‌ అంతరాయం కలిగితే ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఘాట్‌ వద్ద పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లతో పాటు వాటంటీర్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనాన్ని నిర్వహించే ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సజావుగా జరగడంతో పాటు నిమజ్జనం తర్వాత విగ్రహలతో సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకునేలా ప్రతి నిమజ్జనం పాయింట్‌ వద్ద ఒక నోడల్‌ అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, ఆర్డీఓ కె.మహేశ్వర్‌, డీపీఓ వీరబుచ్చయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్‌, ఏసీపీలు కరుణాకర్‌ రావు, నరేందర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మెన్‌ రుద్రరాజు, మానకొండూరు జెడ్పీటీసీ శేఖర్‌ గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వేణుమాధవ్‌, పోలీస్‌, ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love