రోడ్డుపై మూడు బాంబులు.. నిర్వీర్యం చేసిన ఆర్మీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆ బాంబులను నిర్వీర్యం చేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అల్లాడిన మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని నోంగ్‌డామ్, ఇథమ్ గ్రామాలను కలిపే రహదారిపై ఐఈడీలను అమర్చినట్లు ఆర్మీ సిబ్బంది ఆదివారం గుర్తించారు. ఆ వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ రోడ్డును మూసివేశారు. బాంబు స్క్వాడ్‌ను అక్కడకు రప్పించారు. మూడు బాంబులను నిర్వీర్యం చేశారు. కాగా, ఆర్మీ జవాన్ల రొటీన్‌ తనిఖీల సందర్భంగా రోడ్డుపై అమర్చిన ఐఈడీలను గుర్తించినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. మాఫౌ డ్యామ్, నోంగ్‌డామ్ గ్రామానికి సమీపంలో ఈ బాంబులు ఉన్నట్లు చెప్పారు. బాంబు స్క్వాడ్ సహాయంతో రోడ్డుపై అమర్చిన ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు వివరించారు. దీంతో ప్రాణ నష్టం జరుగకుండా, స్థానికులకు గాయాలు కాకుండా నిరోధించినట్లు వెల్లడించారు.

Spread the love