కులవ్యవస్థ ఉన్నంతకాలం

– దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు కాదు…
– కులాన్ని ప్రశ్నిస్తున్నట్టుగానే…కింది కూలాలను గౌరవించాలి
– కేవీపీఎస్‌ సదస్సులో ప్రొఫెసర్‌ హరగోపాల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశంలో కులవ్యవస్థ ఉన్నంత కాలం స్వాతంత్య్రం వచ్చినట్టు కాదని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. అది నాశనం కాకపోగా, అనేక రూపాల్లో పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.1980 తర్వాత అది మరింతగా బలపడుతున్నదని వివరించారు. కొన్ని సందర్భాల్లో దళితులపై దాడులు, దౌర్జన్యాలు భయానకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులవివక్ష వ్యతిరేక పోరాటం సంఘం (కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో ’76 ఏండ్ల స్వాతంత్య్రం ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. అ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ కుల వ్యవస్థను రక్షించే బాధ్యతను మనుస్మృతి తీసుకుందని వివరించారు. అదే విధానాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్నాయని విమర్శించారు. అది మహిళలను సేవకులుగానే భావిస్తున్నదని తెలిపారు. సమాజంలో కులం పాతుకుపోయిందనీ, చివరకు చంద్రమండలం పోయినా దాన్ని పట్టుకుపోతున్నారని ఎద్దేవా చేశారు. మధ్యస్థ కులాలు కులాన్ని ప్రశ్నిస్తున్నాయనీ, అదే సందర్భంలో కింది కులాలను గౌవరించడం లేదని చెప్పారు. ఈ పరిణామాల దృష్ట్యా కుల నిర్మూలన జరగడం లేదని స్పష్టం చేశారు. పూర్వజన్మలో చేసిన పాపాలతోనే దళితులు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొటున్నారంటూ ఆధిపత్యశక్తులు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. మరోవైపు దేవుడు ఉన్నాడనే బలమైన విశ్వాసాలు నెలకొన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సమాజాన్ని మార్చడం చాలా కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఒత్తిడిమేరకు గాంధీ కుల నిర్మూలన అనకపోయినా అంటరానితనం ఉండకూడదని చెప్పినట్టు వివరించారు. కులవ్యవస్థను పని విభజనగా అంటున్నారనీ, కానీ అది మనుషుల విభజన అని తెలిపారు. అందుకే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మనుషులపై పెత్తనం చెలాయిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ విలువలు ప్రశ్నార్థకంగా మారాయని తెలిపారు. మోజార్టీ, మైనార్టీ అనే భావనను సృష్టిస్తున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి వైషమ్యాలు పెంచుతున్నారని చెప్పారు. మానవ సంబంధాల్లో స్నేహ భావం అనేది లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి దేశాన్ని రెచ్చగొట్టడం చాలా సులువుగా మారిందన్నారు. కొన్ని లక్షల మంది దేశాన్ని వదిలి ఇతర దేశాల్లో స్థిరపడిపోతున్నారనీ, ఇదెక్కడి దేశ భక్తో అర్థం కావడం లేదని వాపోయారు. ఆదివాసీల కోసం నిత్యం పని చేస్తున్న సుధా భరద్వాజ్‌ దేశద్రోహి ఎలా అయ్యారని ప్రశ్నించారు. కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలకులపై కొట్లాడి దేశం నుంచి వెళ్లగొట్టాం…కానీ అంటరానితనాన్ని, కుల నిర్మూలనను పారద్రోలడం మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. దళితులపై అత్యాచారాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యా, ఉద్యోగరంగాలు, పరిశ్రమలు, ప్రాజెక్టులు, భూములతోపాటు సంక్షేమ పథకాల్లోనూ దళితులకు సరైన వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు పౌర హక్కులను కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాద చర్యలతో సామాజిక న్యాయం అనే ఎజెండా పక్కకు పోతున్నదని చెప్పారు. అందుకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదులు, వామపక్ష శక్తులు ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, ఎం.దశరథం, బి. సుబ్బారావు, సీనియర్‌ నాయకులు కృపాసాగర్‌ తదితరులు ఉన్నారు.

Spread the love