గాజాలో ఆగని దాడులు !

Non-stop attacks in Gaza!– 48గంటల్లో 90మందికి పైగా మృతి
డేర్‌ ఎల్‌ బాలాహ్‌ : గాజాపై ఇజ్రాయిల్‌ మారణకాండ కొనసాగుతునే వుంది. గత 48 గంటల్లో 90మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు శనివారం తెలిపాయి. వీరిలో మహిళలు, పిల్లలే అధిక సంఖ్యలో ఉన్నారు. మానవతా జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్న వారు కూడా మరణించిన వారిలో వున్నారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఖాన్‌యూనిస్‌ నగరంలో 11మంది మరణించారు. వీరిలో చాలా మంది అల్‌ మావసి ఏరియాలో వేసిన శిబిరంలో తల దాచుకున్నవారే. రఫా నగరంలో వేర్వేరుగా జరిగిన దాడుల్లో నలుగురు మరణించారు. గత రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 15మంది ప్రాణాలు కోల్పోయారు. గాజావ్యాప్తంగా దాడులను ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఇజ్రాయిల్‌ ఇప్పటికే పలు భద్రతా జోన్‌లను ఆక్రమించింది. గత ఆరు వారాలుగా గాజాలోకి ఆహారం, ఇతర నిత్యావసరాలు రాకుండా అడ్డుకుంటోంది. దీంతో అక్కడ పరిస్థితులు అత్యంత దుర్భరంగా వున్నాయి. వేలాదిమంది పిల్లలు పోషకాహార లోపం బారిన పడ్డారని సహాయక సంస్థలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని
అమెరికా కొత్త రాయబారికి ఐరాస విజ్ఞప్తి
ఆహార నిల్వలు తరిగిపోతుండడంతో రోజుకు ఒకసారి భోజనం చేయడం కూడా కష్టంగా మారిందని ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. గాజాలో విధించిన ఆహార దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేసేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ఇజ్రాయిల్‌కు కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి మైక్‌ హకాబిని ప్రపంచ ఆరోగ్య సంస్థ తూర్పు మధ్యధరా ప్రాంత డైరెక్టర్‌ హనన్‌ బాల్కీ కోరారు. హకాబి తక్షణమే అక్కడకు వెళ్లి పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని కోరారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 51వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 90శాతానికి పైగా జనాభా నిర్వాసితులయ్యారు. వేలాదిమంది తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. విస్తృతంగా జరుగుతున్న దాడులతో గాజాలో మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Spread the love