గుడిసెవాసులపై దాడులు ఆపాలి

Attacks on slum dwellers should be stopped– బచ్చన్నపేటలో పేదలపై పోలీసుల నిర్బంధం తగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జనగామ జిల్లా బచ్చన్నపేటలోని గుడిసెల కేంద్రాన్ని గత రెండు రోజులుగా పోలీసులు చుట్టుముట్టారనీ, వాటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ(ఎం) పేర్కొంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. గుడిసెవాసుల మీద పోలీసుల నిర్బంధాన్ని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లోని 69 పోరాట కేంద్రాల నాయకుల సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ గుడిసె వాసుల పరిస్థితులను సమావేశంలో సమీక్షించామని చెప్పారు. ఈమధ్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన సందర్భంగా, ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న గుడిసెలను తొలగించటం తమ ప్రభుత్వ విధానం కాదంటూ స్పష్టం చేశారని అన్నారు. అయినప్పటికీ స్థానిక అధికారులు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లతో కుమ్మక్కై గుడిసెవాసులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, మహబూబాబాద్‌ కేంద్రాలతోపాటు వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఒక్కొక్క కేంద్రాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. వందలాదిమంది మీద అక్రమ కేసులను పోలీసులు బనాయించారని అన్నారు. మళ్లీ గుడిసెలు వేయొద్దంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు బచ్చన్నపేటలో మరోసారి దాడికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గుడిసెవాసుల మీద ఇలాంటి దాడులను ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. తక్షణం వారిపై నమోదు చేసిన కేసులను రద్దు చేసి, ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వాలనీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు జి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love