తన మొదటి ప్రయత్నంతో కోర్టులో అటెండర్ ఉద్యోగం సంపాదించాడు. ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి న్యాయమూర్తి వద్ద ఎంతో కష్టించి పనిచేస్తున్నప్పటికీ, తన స్థాయి కారణంగా న్యాయమూర్తి తనకు సరైన గౌరవం ఇవ్వడంలేదన్న భావన కలిగింది. రోజంతా విధినిర్వహణలో సమయం వెచ్చిస్తున్నందున తన నైపుణ్యాలను కోల్పోతున్నాననే బాధ ఉన్నప్పటికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఉద్యోగం తప్పనిసరి అని నిర్ణయించుకున్నాడు. ఓరోజు న్యాయమూర్తి ప్రవర్తనతో విసుగుచెంది, అటెండర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ సంఘటన తర్వాత అతను తన ఆత్మకథను ”మై సాన్ జడ్జ్ డా అర్ధాలి” అని తన మాత భాష అయిన పంజాబీ భాషలో రాసుకున్నాడు. అతనే ”నిందర్ ఘుగియాన్వి”.
నిందర్ ఘుగియాన్వి ఒక అటెండర్ స్థాయి నుండి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన క్రమం ఎందరికో స్ఫూర్తిదాయకం. తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, ఘుగియాన్వి 69 పుస్తకాలు రాశారు. తన ఆత్మకథలో భారత న్యాయ వ్యవస్థలో క్లాస్ ఫోర్ ఉద్యోగులను వ్యక్తిగత సేవకులుగా ఎలా ఉపయోగిస్తారో చిత్రీకరించబడింది. ఈ పుస్తకం ప్రజాదరణ పొందడమే కాదు అతని ఆత్మకథ ”ఐ వాజ్ ఏ సెర్వెంట్ టు ఏ జడ్జ్” అని ఆంగ్లంతో పాటు 15 భారతీయ భాషలలోకి అనువదించబడింది. గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం, పంజాబీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయంతో సహా అనేక విశ్వవిద్యాలయాలు ఆయన రచనలను వారి పాఠ్యాంశాల్లో చేర్చాయి. 12 విశ్వవిద్యాలయాలలో ఎంఫిల్, పిహెచ్‌డి విద్యార్థులు ఆయన రచనలపై పరిశోధనలు నిర్వహించారు.
అటెండర్ నుంచి ప్రొఫెసర్ గా ఎలా ఎదిగారు తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలు తప్పనిసరిగా చదవాల్సిందే..
కోర్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత పంజాబ్ భాషా విభాగంలో తోటమాలి గా చేరారు. అక్కడ అతని పని మొక్కలకు నీరు పెట్టడం తోటను చూసుకోవడం మాత్రమే. ఘుగియాన్వి ‘ఇక్ తారా’ తుంబి వాయించడంలో ప్రావీణ్యత కలిగినందున సాహిత్య విభాగంలో జరిగే కార్యక్రమాలలో ఇక్ తారా వాయించేవాడు. అతి తక్కువ సమయంలోనే సంగీత వాయిద్య కళాకారుడిగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఒక తోటమాలి ఇంత ప్రజాదరణ పొండటమేంటని కొంతమంది అధికారులు అసూయపడి అతన్ని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించారు. టాలెంట్ ఉన్నోడిని ఎవరూ ఆపలేరు అన్నట్లు అతనికి పంజాబీ భాషపై పట్టున్నందున కాలక్రమేణా అతను ప్రభుత్వ భాషా శాఖ సభ్యుడిగా ఎంపికైనారు. మొదటిసారిగా తన కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతనిని తోటమాలి ఉద్యోగం నుండి తొలగించిన అదే అధికారి, అతన్ని మిస్టర్ నిందర్ ఘుగియాన్వి జీ అని పిలవడం ప్రారంభించాడు. నిందర్ ఘుగియాన్వి సాధారణ జీవితం నుండి సాహిత్య ఔన్నత్యానికి ఎదగడం పంజాబీ సంస్కతి, భాష, సాహిత్యం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం. పంజాబీ సంస్కతికి ఆయన చేసిన కషిని గుర్తించి పంజాబ్ విశ్వవిద్యాలయం ‘సాహిత్య రతన్’ అవార్డుతో సత్కరించింది.
అటెండర్ గా తన కెరీర్‌ను ప్రారంభించి, తన ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాడు. చివరికి పంజాబీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచి, 69 కి పైగా పుస్తకాలు రాయడానికి దోహదపడింది. ఆయన రచనలపై అనేక లఘు చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన పంజాబ్ జానపదాలు, సంస్కతిపై పరిశోధనలు చేశారు. ఆయన నైపుణ్యాన్ని గుర్తించి, IAS,PCS అభ్యర్థులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికి ఆహ్వానించారు. ఇటీవల, ఆయన బటిండాలోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. నిందర్ ప్రపంచవ్యాప్తంగా USA, UK, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పర్యటించి విదేశీ సంస్కతుల గురించి నేర్చుకుంటూనే తన సొంత సంస్కతిని విదేశాలకు ప్రచారం చేశారు.
1994లో భారత రాష్ట్రపతి ఎస్.గియాని జైల్ సింగ్, 2001లో కెనడా ప్రధానమంత్రి శ్రీ జి. క్రెచియన్, 2005లో యుకె ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ వంటి ఉన్నత స్థాయి ప్రముఖులచే సత్కరించబడిన గౌరవం నిందర్ ఘుగియాన్వికి లభించింది.
నిందర్ ఘుగియాన్వి యొక్క ఆత్మకథను ‘నేను జడ్జిగారి సేవకుడ్ని’ అన్న పేరుతో డా. రహీమ్ పఠాన్ ఖాన్ తెలుగులోకి అనువదించారు.
జీవితం తరచుగా ఊహించని మలుపులు తీసుకుంటుంది. విజయం కొన్నిసార్లు తీవ్ర ప్రతికూల క్షణాల నుండి ఉద్భవిస్తుంది. ఆశయం కోసం నిరంతరం కషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదాక్రాంతమవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
– కోట దామోదర్, 9391480475