వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తులు వేలం

నవతెలంగాణ హైదరాబాద్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయివేటు లిమిటెడ్‌, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న ఈ – వేలం వేయనున్నట్టు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గురువారం ప్రకటన విడుదల చేయడం సంచలనం సృష్టించింది. వ్యాపార అవసరాలకు వీరు కొన్నేళ్ల కిందట ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.340 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. కొవిడ్‌ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతినగా, కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం బుట్టా ఇన్‌ఫ్రాతోపాటు ఇతర సంస్థలపై పడింది. రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ నిర్ణయించింది. బకాయిల చెల్లింపు అంశంపై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్సీఎల్టీ)లో ఉంది. ఈ నేపథ్యంలో వేలం ప్రకటన ఇవ్వడం గమనార్హం. విషయం ఎన్సీఎల్టీలో ఉండగా వేలం ప్రకటన విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక దంపతులు అంటున్నారు. వేలం ప్రక్రియ నిలిపివేసేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె తెలిపారు.

Spread the love