ఏ మాటకామాటే చెప్పుకోవాలి. యోగేంద్రయాదవ్ లాంటి ఎన్నికల గణాంక స్పెషలిస్టులు (సిఫాలజిస్టులు) మన రాష్ట్రానికొచ్చి ఎన్నికల తేదీకి నలభై రోజుల ముందు నుండే ఏరులై పారుతున్న మద్యాన్ని గణించి, ఆనకట్టల పునాదుల్ని కదిలిస్తున్న అవినీతి లెక్కలు గుణించి, సదరు ఆనకట్టల పైనుండి దుంకుతున్న నోట్లకట్టలు లెక్కించి మన తెలంగాణ ‘సామర్థ్యాన్ని’ వెల్లడించడం మనకు ‘గర్వ కారణమే’. ఏమైనా సామ్రాట్‌కున్న వెసులుబాటు సామంతరాజులకు ఉండదు. రాష్ట్రాల కడుపులు కొట్టి, రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీసింది బీజేపీ. రాష్ట్రాల ఆదాయాన్ని కైంకర్యం చేస్తూ జీఎస్టీ తెచ్చింది. 2017 జూలై నుండి కేంద్రం వద్ద లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో సంపద పోగుబడింది. సేల్స్‌టాక్స్ రాష్ట్రాలకున్న ఏకైక ఆదాయ వనరు. దాన్ని కబ్జా చేసి పోగేసుకున్న నిధియే అది. ఇటు వంటి ఎన్నింటినో కలిపి మోడీ ఘనకార్యాల క్యాంపెయిన్‌ను నిర్వహించబోతున్నారు. మోడీ కటౌట్లతో అలంకరించిన వాహనాలు దేశంలోని 765 జిల్లాలు తిరుగుతాయి. జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారుల నుండి కింది అధికారులు దానిలో కూర్చొని పంచాయతీల వరకు డప్పుకొట్టి ప్రచారం చేస్తారట. విపక్షాలు విమర్శించడమే కాదు, ఇది చట్ట విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారులు 70మందికి పైగా రాష్ట్రపతికి విన్నవించారు. ఈ ‘రథ్ ప్రభారీలు’ విషయం విని, చదివి దేశం యావత్తు ‘ఔరా’ విస్తుపోతున్నది. వ్యవ హారం అక్కడితో ఆగలేదు. సాయుధ దళా ల్లో పనిచేసేవారికి ఏడాదికి రెండు నెలలు సెలవులిస్తారు. ఆ సమయంలో వారిని వట్టిగా ఉంచడం ఎందుకు అనుకున్నాడో ఏమో మోడీ సాబ్ వారికి ‘సైనిక దూత’ లని పేరుపెట్టి వారివారి ఊళ్లలో మోడీ ప్రభుత్వ ప్రచారం చేయాలని ఒక సర్క్యులర్ విడుదల చేశారు. సైన్యాన్ని నేరుగా ప్రభుత్వ ప్రచారకులుగా వాడుకోవడం మన రాజ్యాంగానికే వ్యతిరేకం. రక్షణశాఖ పైత్యం మరో వైపరీత్యానికి దారితీస్తోంది. దేశవ్యాపితంగా 822 సెల్ఫీపాయింట్లు ఏర్పాటు చేస్తారట. మోడీ ప్రభుత్వం సైనికపరంగా సాధించిన విజయాలను పెద్ద పెద్ద హోర్డింగుల్లో పెడతారట. వాటిలో మోడీ బొమ్మ తప్పనిసరిగా ఉండాలని రక్షణ శాఖ పేర్కొంది. భారతదేశంలో గత 75 ఏండ్లలో కనీవినీ ఎరు గని ఇటువంటి వింతలను చూసి దేశం ఔరా అని నోరు నొక్కుకుంటోంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే మాటను జర్రంత మార్చి సామ్రాటే తలుచుకుంటే ఓట్లకు కొరవా అని చదువు కుంటే పై విషయాలన్నీ అర్థమవుతాయి.
దుబ్బాక, హుజురాబాద్‌లలో గెలుపు, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో దేశ హోంమంత్రే వచ్చి హైదరాబాద్ ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం వంటి వికృత చేష్టలతో ఓట్లు పోలరైజ్ చేశారు. తమ సీట్లను నాలుగు పదులు దాటించుకున్నారు. కర్నాటక అయిపోయింది. ఇక తెలంగాణే తమ లక్ష్యం అని ఢిల్లీ నాయకుల నుండి గల్లీ నాయకుల వరకు ఊదరగొట్టారు. ఒక ‘చేరికల కమిటి’ వేశారు. బీఆర్‌ఎస్ నుండి దొల్లుకుంటూ వచ్చి కాషాయ తీర్థం పుచ్చుకున్నాయనే దానికి చైర్మెన్. నేటి పరిస్థితేమిటంటే బీజేపీ నుండి బయటటికి పోయే వారే తప్ప లోనికొచ్చే వారే దొరకట్లేదు. ఈ వివరాలు రోజూ మీడియాలో చూస్తున్నాం. బయటికి పోయే వారి లిస్టు ఇంకా చాంతాడంతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలు తీసుకున్న లైనే నేటి బీజేపీ దుర్గతికి కారణమని ఆలోచనా పరులెవరికైనా అర్థమౌతుంది. నిరం తరం బీఆర్‌ఎస్ కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నా మునుగోడులో బీఆర్‌ఎస్‌ను బలపరిచాయి. కేవలం ఆ ఓట్లతోనే బీజేపీ మునుగోడులో ఓడింది. అదే జరి గుండకపోతే రాష్ట్రంలో సీన్ వేరే ఉంటుండే. ‘వీరి బలమెం తం’టూ వామపక్షాలను గేలిచేసే వారికి ఆచరణలో ఇచ్చిన సమాధానం ఏమంటే ‘కాషాయ సునామీ నుండి తెలంగాణను కాపాడగలిగింత’ అని.
అంగలార్చుకుంటూ బీజేపీ వైపు పరుగులెత్తిన వారంతా నేడు అటూ ఇటూ పరిగెత్తి కండువాలు మార్చుకుంటూంటే రాష్ట్ర ప్రజలు విస్తుపోయి ‘ఔరా’ అని చూస్తున్నారు. ఒక నేత కార్మికుడు వివిధ పార్టీ చర్చించుకుంటున్న ప్యానల్ డిస్కషన్ వద్దకెళ్లి తాను కష్టపడి తయారు చేసిన కండువాను వారి ముందు పెట్టాడట! దాని ప్రత్యేకత ఏమంటే ఏ పార్టీ వాండ్లు వేసుకుంటే వారి రంగులోకి మారుతుందట! ఇది జోకే అయినా నేటి పరిస్థితికి అద్దం పట్టట్లేదా?
నేడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు, ప్రజా సమస్యలు చర్చలోకొస్తున్న స్థితే లేదు. ప్రజల కోసం తపించే వారి గొంతులు జీరపోతున్నాయి. నోట్లకట్టల మాయాబజార్‌లో మం త్రాలు తెలీని, తాంత్రికులు కాలేని మానవులుగా మిగిలిపోరాదంటే పెద్దఎత్తున రాష్ట్రంలో వర్గపోరాటాలను నిర్మించడమొక్కటే మార్గం.