వేసవి భత్యం ఎగవేత..!

Evasion of summer allowance..!– మండుటెండలో ఉపాధి పనులు
– సొమ్మసిల్లి పొతున్న కూలీలు
– రెండు పూటలు అటెండెన్స్‌
– కేంద్రం నిర్ణయాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం
– ఆందోళనలో కూలీలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. పేద కార్మికుల ఉపాధికి గండిపెట్టే ప్రయ్నతం చేస్తోంది. ప్రతి ఏడాది వేసవి కాలంలో వేసవి భత్యం ఇవ్వాల్సిన ప్రభుత్వం దానిని ఎగొట్టే ప్రయత్నం చేస్తోంది. గతేడాది నుంచి కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌ కింద మార్చి నెల నుంచి జూన్‌ వరకు ఇవ్వాల్సిన అదనపు బోనస్‌కు నిధులు ఇవ్వడం లేదు. దీంతో కార్మికులు మండుటెండలో రెక్కలు ముక్కలు చేసుకున్న కనీసం దినసరి కూలీ రూ.100 కూడ దాటకపోవడంతో కూలీలు అందోళన చెందుతున్నారు. భగ్గుమంటున్న ఎండలో కష్టం చేసిన ఫలితం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ గోస చూసైన కూలీ పెంచాలని కోరుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిలాల్లో 2,65,352 జాబ్‌ కార్డులు ఉండగా, 6,90,298 మంది కార్మికులు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది ఉపాధి పనులకు వెళ్లిన వారు 5,30,294 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో లక్ష 65 జాబ్‌ కార్డులు ఉండగా 2లక్ష మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 87వేల జాబ్‌కార్డులు ఉండగా.. 4లక్షల మంది కూలీలు ఉన్నారు. నిర్విరామంగా కూలి పనులు వెళ్లే వారి సంఖ్య లక్ష 20 వేల మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో వికారాబాద్‌లో ఉపాధి కూలీల సంఖ్య ఎక్కువగా ఇక్కడ సాగు నీటి వసతులు తక్కువగా ఉండటంతో రైతుల కూలీలు ఎక్కువగా ఉన్నారు. వీరంత గ్రామీణ ఉపాధి హామీపై ఆధారపడి జీవనం సాగిస్తారు. గతేడాదిలో వంద రోజు ఉపాధి కల్పనలో రాష్ట్ర వికారాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. కానీ ప్రస్తుతం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుని రోజుకో మార్పు తీసుకుని.. కూలీలపై ఒత్తిడి పెంచే నిర్ణయాలు తీసుకుంటుండటంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో సైతం రెండు పూటలు పని చేయాలని.. లేదంటే కూలి డబ్బులు రావంటు అల్టిమేట్‌ జారీ చేయడంతో ఉపాధి కూలీల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. ఈ మండుటెండల్లో పని చేసేదెట్లా..బతికెదెట్లా..కూలీలు ఆందోళన చెందుతున్నారు.
వేసవి భత్యానికి మంగళం..
వేసవి కాలంలో పనులు చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు సగటున 25 శాతం వేతనం అదనంగా చెల్లించాలి. అయితే ఈ పథకం కేంద్రం కబందహస్తంలో వెళ్లినప్పటి నుంచి వేసవి భత్యాని ఎగ్గొట్టింది. కూలీలు చేసిన పనిని కొలతలు ఆధారంగా లెక్కించి వేతనం చెల్లించాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నాలుగైదు గంటల పాటు కష్టపడుతున్నా సగటు కూలి రూ.150 నుంచి రూ.190 మధ్యనే లభిస్తోంది. కానీ ప్రస్తుతం ఎండలు భగ్గుమంటుండంతో నేలలు గట్టిబారి ఎంత కష్టపడిన వేతనం గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. గతంలో మాధిరిగా వేసవి భత్యం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
రెండు పూట అటెండెన్స్‌
ఉపాధి పనులు వేసవి కాలంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ జరుగుతుండేవి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబ్‌ కార్డు కలిగిన కూలీల కుటుంబాల వారికి కేటాయించిన 100 రోజుల పని దినాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విధిగా పనులకు హాజరు కావాలి. ఎంత మంది పనులకు వచ్చారనే విషయాన్ని ఉపాధి హామీ పథకం మేట్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మస్టర్‌లో నమోదు చేయాలి. ఇప్పటికే స్థానికంగా పనులు లేక కొన్ని గ్రామాల్లోని కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. రెండు పూటల పని విధానంతో గ్రామం నుంచి పని ప్రదేశాలకు సుమారు రెండు, మూడు కిలోమీటర్ల వరకూ రెండుసార్లు తిరగలేక కూలీలు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ ఉదయం ఉపాధి పనికి వెళ్లినా.. మధ్యాహ్నం నుంచి వ్యవసాయ పనులు, పశువుల పెంపకం ద్వారా వారు కొంత ఆదాయం పొందేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదని కూలీలు వాపోతున్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఈ జీఓను రద్దు చేయాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉపాధి కూలీలకు వేసవి భత్యం చెల్లించాలి
నేలలు గట్టిబారినవి కొలత ప్రకారం వేతనం చెల్లిస్తున్న క్రమంలో కూలీలకు కనీసం దినసరి కూలి రూ. 100 కూడ వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం గతంలో మాదిరిగా వేసవి కాలంలో మూడు నెలల పాటు సమ్మర్‌ అలెవెన్స్‌ కింద చెల్లించిన 25 శాతం అదనపు వేతనాన్ని అమలు చేయాలి.
– పి. జగన్‌, వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా

Spread the love