ఇలా బ్యాలన్స్‌ చేసుకోండి

జీవితం అంటే పూలపాన్పు కాదు.. సుఖదుఖాల సంగమం. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగితేనే సక్సెస్‌ మన సొంతమవుతుంది. అంతేకానీ ఆ బాధల్నే తలుచుకుంటూ కూర్చుంటే వాటి ప్రభావం కెరీర్‌పై కూడా పడుతుంది. ఉద్యోగం విషయంలోనూ అంతే.. మనకు వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు.. ఆఫీసుకి కూడా వాటిని మోసుకొస్తే అవన్నీ పనిపై ప్రభావం చూపచ్చు. కాబట్టి ఎన్ని వ్యక్తిగత సమస్యలున్నా సరే.. వాటిని ఇంటికే పరిమితం చేసి ఆఫీసుకి వచ్చేటప్పుడు ప్రశాంతమైన మనసుతో వచ్చి మీ పని మీరు సక్రమంగా చేస్తే జీవితంలో పైచేయి మీదే… కాబట్టి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను బ్యాలన్స్‌ చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం…
– కెరీర్‌లో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో చేరుకోవాలంటే ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. కాబట్టి వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలెదురైనా సరే వాటిని పక్కనపెట్టి ప్రణాళిక ప్రకారం ఫాలో అయితే విజయం మీదే అవుతుంది.
– వ్యక్తిగత సమస్యలున్నప్పుడు కోపం రావడం సహజం.. కానీ ఈ కోపాన్ని అదుపులో ఉంచుకుని పని చేస్తేనే కెరీర్‌కి ఎలాంటి ముప్పూ రాదు. అంతేకానీ మీ కోపాన్ని సహోద్యోగులపై చూపిస్తే ఆ ప్రభావం మీ జాబ్‌పై.. కెరీర్‌పై.. పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకుని ముందుకు సాగితే మీ వ్యక్తిత్వంపై అందరికీ మంచి అభిప్రాయం కలుగుతుంది.
– మన చుట్టూ మనల్ని ప్రోత్సహించే వారికంటే నిరుత్సాహపరిచే వాళ్లే ఎక్కువగా ఉంటారని మనకు తెలుసు. అలాగే మనకేవైనా వ్యక్తిగత సమస్యలుంటే వాటిని పంచుకునే వారికంటే వాటిని చూసి దెప్పి పొడిచేవాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనకు చాలా దగ్గరగా అనిపించిన సహోద్యోగులకు తప్ప వేరే వాళ్లందరికీ ఈ విషయాలన్నీ చెప్పకపోవడం మంచిది. ఎవరైనా మీ విషయాలన్నీ తెలిసి మిమ్మల్ని హేళన చేస్తే మీరు వారితో గొడవకు దిగకుండా నిశ్శబ్దంగా ఉండండి. దీంతో మీ వ్యక్తిత్వం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే కొన్నాళ్లకు వాళ్లే మీ దారిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
– బతికినంత కాలం ప్రతిఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా ఏదో ఒక సమస్య ఎదురవడం సహజం. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడమా? లేక వెనక్కి తగ్గడమా? అనేది మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని ధైర్యంగా ఎదుర్కొంటే జీవితంలో మంచి సక్సెస్‌ వస్తుంది. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. దీని ప్రభావం మనం చేసే ఉద్యోగంపై పడే అవకాశమూ ఉంది.
– ఒక్కోసారి బాస్‌ ఇచ్చిన వర్క్‌ మనకు నచ్చకపోయినా, లేదా సరైన సమయంలో పూర్తికాకపోయినా ఒత్తిడికి గురవడం సహజం. ఇక దీనికి వ్యక్తిగత సమస్యలు కూడా తోడవుతాయి. ఇలాంటప్పుడు చిరాకు, అసహనం కలుగుతాయి. పనిపై శ్రద్ధ పెట్టలేం. దీని ప్రభావం కెరీర్‌ పైనా పడుతుంది. అందుకే అన్ని విషయాల్లోనూ ఓర్పు అనేది చాలా అవసరం.
– సమస్యలకు తగిన పరిష్కారాలు మనకు తట్టకపోవచ్చు. మీకు సన్నిహితంగా ఉండే స్నేహితులతో, కొలీగ్స్‌తో మీ సమస్యల్ని చెప్పి తగిన సలహా అడగండి.. మీ సమస్య పరిష్కారానికి వాళ్లిచ్చే సలహాలూ ట్రై చేయండి.
– పని చేసే చోట తోటివారితో కలుపుగోలుగా ఉండాలి. ఆఫీసులో ఉన్నంతసేపు సహోద్యోగులతో కలిసిపోయి కాసేపు ఆనందంగా నవ్వుతూ ఎంజారు చేయాలి. దీంతో సమస్యలన్నీ మరిచిపోయి సులభంగా పనిపై దృష్టి సారించొచ్చు.

Spread the love