సాధికారతే లక్ష్యంగా…

షైఖా జవహర్‌ అల్‌ ఖలీఫా… మహిళా సాధికారత కోసం తన వంతు కృషి చేస్తున్న వ్యక్తి. రాజకుటుంబంలో పుట్టినా తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకునేందుకు నిత్యం తపిస్తున్నారు. ఓ వ్యాపారవేత్తగా మారి భారతదేశంలోని వివిధ ప్రాజెక్టులలో మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో 50 బిలియన్ల నిధిని ప్రకటించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
ఖలీఫా బహ్రెయిన్‌ రాజకుటుంబ సభ్యురాలు. యూఏఇలో పెరిగారు. ఈ-కామర్స్‌తో పాటు రియల్‌ ఎస్టేట్‌, కమోడిటీ ట్రేడింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫుట్‌వేర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, స్టార్టప్‌ సపోర్ట్‌, మార్కెటింగ్‌, అడ్వర్టైజింగ్‌, ట్రేడ్‌, ప్రొడక్ట్‌ డిస్ట్రిబ్యూషన్‌లలో ఆసక్తి ఉన్న దుబారు ఆధారిత గ్రీన్‌ అవెంచురైన్‌ హోల్డింగ్‌ వ్యవస్థాపకురాలు. అలాగే వాటి చైర్‌పర్సన్‌ కూడా.
పేరున్నా అంత సులభమేమీ కాదు
”నాకు విలువనిచ్చే కుటుంబంలో పుట్టడం నాకు దక్కిన మంచి అవకాశం. అయితే ఇతరులకు సహాయం చేయడానికి ఈ పేరును ఉపయోగించడం కూడా నా కర్తవ్యం” అంటారామె. రాయల్‌గా ఆమెకున్న ప్రత్యేకాధికారం తన వ్యాపారాలకు అంత సులభమైన మార్గమేమీ కాలేదు. ఖలీఫా ఎప్పుడూ ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండేందుకు ఇష్టపడ్డారు. ”సంప్రదాయవాద అరబ్‌ కుటుంబం నుండి వచ్చిన నేను అనుసరించడానికి ముందే ఒక మార్గం రూపొందించబడింది. యూనివర్సిటీలో మెడిసిన్‌, ఆర్కిటెక్చర్‌ లేదా లా ఎంచుకోవాలి. అయితే నేను ఆ మూడింటిని వ్యతిరేకించాను. దౌత్యవేత్తగా నా కెరీర్‌ను ప్రారంభించాలని రాజకీయ శాస్త్రాన్ని ఎంచుకున్నాను” అన్నారు. అయితే ఆమె చివరకు విభిన్న మార్గాలను నడపవలసి వచ్చింది. అంతర్జాతీయ సంబంధాలకు, తర్వాత ప్రజా సంబంధాలకు, చివరకు వ్యాపార నిర్వహణ తన ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు.
సాధికారతవైపు మళ్లించారు
”నేను ఎప్పుడూ నా సొంతంగా ఉండాలనుకుంటున్నాను. దాన్ని నిరూపించుకోవడానికి పోరాడుతున్నాను” అంటూ ఆమె జతచేస్తున్నారు. అందుకే ఆమె వివిధ స్థానిక కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొని మహిళలు, యువత సాధికారత వైపు తన అభిరుచిని మళ్లించారు. తన వ్యాపార ప్రయోజనాలతో పాటు, మహిళలకు సాధికారత కల్పించడం వల్ల మొత్తం కుటుంబాలు విజయవంతం కావడానికి సాధికారత లభిస్తుందని ఖలీఫా అభిప్రాయపడ్డారు.
యువతకు సహకరిస్తాము
యువత కోసం వ్యాపారాలలోకి కొత్త ఆలోచనలను అనువదిం చడానికి ఆమె అబుదాబిలో ఒక ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ”మేము వారి ఆలోచనలను వింటాము. నిధులను సేకరించడంలో వారికి సహాయం చేస్తాము. వారికి కావల్సిన మార్గదర్శకత్వం, నైపుణ్యం అంది స్తాము. యువ పారిశ్రామికవేత్తలను, వారి వ్యాపారాలను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేసే గ్లోబల్‌ యూత్‌ బిజినెస్‌ క్లబ్‌లో నేను కూడా భాగం” అని ఆమె చెప్పారు. ఖలీఫా ప్రకారం ప్రారంభంలో ఆమె పేరు, పరిచయాలు యువత విజయవంతం కావడానికి తలుపులు తెరిచేందుకు సహాయపడ్డాయి. పరిచయాలు ఏర్పడే వరకు, వ్యాపార భాగస్వామ్యం ఏర్పడే వరకు యువ వ్యాపారవేత్తలతో కలిసి ఉండటమే ఆమె పని. దాని తర్వాత ఆమె పాత్ర ముగిసిపోతుంది. యూఏఇలో ఆమె దుబారు ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ, దుబారు టూరిజం అథారిటీ వంటి సంస్థలతో కలిసి పనిచేయడానికి యువ ఆవిష్కర్తలకు సహాయం చేశారు.
వివిధ ప్రాజెక్టుల ద్వారా…
”తమ కుటుంబ వారసత్వా నికి మించి అడుగులు వేసి మహిళల జీవితాల్లో మార్పును సృష్టించాలని కోరుకునే దృఢమైన, భావసారూప్యత కలిగిన మహిళా వ్యాపారవేత్తలతో భాగస్వామ్యం కావాలని నేను భావిస్తున్నాను” అని ఆమె అంటున్నారు. వారిలో పటేల్‌ కుటుండానికి చెందిన దీపికా పటేల్‌ కూడా ఉన్నారు. దీపికా వివిధ మహిళల కార్యక్రమాలకు మద్దతిస్తు న్నారు. మహిళల కోసం చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని దేశం నాకు పెట్టుబడి పెట్టడానికి సరైన తలుపులు తెరుస్తుందని నమ్ముతున్నాను” అని ఖలీఫా ఆశావాహంతో ఉన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, విద్య, నీటి సంర క్షణ, పర్యావరణ సంబంధిత వెంచర్ల లో పెట్టుబడులు పెట్టేటప్పుడు వివిధ ప్రాజెక్టుల ద్వారా భారత దేశంలోని మహిళలు, కుటుంబాల అభివృద్ధి మాత్రమే తన దృష్టిలో ఉంటుందని ఆమె నొక్కి చెబుతున్నారు.
ప్రాణాళిక రూపొందించుకుని
ఫిబ్రవరిలో ఆమె మొదటిసారి భారతదేశాన్ని సందర్శించారు. తర్వాత మేలో మళ్లీ భారతదేశాన్ని సందర్శించి మహిళలకు ఏమి అవసరమో, తన ఫండ్‌ వారికి ఎంతవరకు సహాయం చేయ గలదో ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి వివిధ నగరా లకు వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకుం టున్నారు. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జిసిసి) లో మహిళలకు అవకాశాలు కల్పించినందుకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సామర్థ్యమున్న ప్రతి మహిళను
”మేము ఈ ప్రాంతంలో చాలా మంది మహిళా సాధకులను చూస్తు న్నాం. ఎందుకంటే వారికి అనేక అవకాశాలు, మద్దతు, సరైన సాధ నాలు ఉన్నాయి. సామర్థ్య మున్న ప్రతి మహి ళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, ఆమె విజయం సాధించడాన్ని చూడడం, అన్ని ప్రాంతాల నుండి మహిళా పారిశ్రామికవేత్తలు విజయ వంతంగా ఎదిగేందుకు అవ సరమైన దారులను అన్వే షించడం నా లక్ష్యం. నా నైపుణ్యం ప్రజలను కనెక్ట్‌ చేయడంలో ఉంది. నేను దీన్ని కొనసాగిస్తాను” అంటూ ఖలీఫా తన మాటలు ముగించారు.
బిజినెస్‌ ఫర్‌ గుడ్‌
వ్యాపారం, సామాజిక మార్పు ఒకదానితో ఒకటి కలిసిపోవాలని విశ్వసిస్తున్న ఖలీఫా ఇటీవల ఫిలిప్పీన్స్‌లో పెట్టుబడులు పెట్టమని వైస్‌ ప్రెసిడెంట్‌ సారా డ్యూటెర్టే ఆహ్వానించారు. దేశంలోని జైళ్లలో ఉన్న మహిళలకు బట్టలు, బ్యాగులు తయారు చేయడంలో ఆమె సహాయం చేస్తున్నారు. ”మహిళలు ఏం తయారు చేసినా మేము అమ్ముతాము. వారి కుటుంబాలను పోషించడానికి ఆర్థికంగా వారికి చేయూతనిస్తాయి’ ఆమె జతచేస్తున్నారు. ఇప్పుడు ఆమె తన ”బిజినెస్‌ ఫర్‌ గుడ్‌” ఫిలాసఫీని భారతదేశానికి విస్తరింపజేస్తున్నారు. వివిధ ప్రాజెక్ట్‌లు, కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడానికి 50 బిలియన్ల నిధిని ప్రకటించారు.

Spread the love