దేశంలోని కోట్లాది పేద మహిళలకు పొగరహిత వంట అవకాశాన్ని అందించాలన్న ఉద్దేశంతో 2016లో పి.ఎమ్ ‘ఉజ్వల యోజన’ను ప్రారంభించారు. ”కట్టెల పొయ్యిలో వండే మా తల్లులకి గౌరవంగా జీవించాలన్నదే మా ఉద్దేశం” అని కూడా చెప్పారు. అందుకే ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఆనాడు మోడీ భావోద్యేగంతో చెప్పిన తీరు ఇప్పటికీ మహిళలకు గుర్తుంది. అ నినాదం ఆయనకూ, ఆయన పార్టీకి రాజకీయంగా ఎంతగానో ఎంతో లబ్ది చేకూర్చింది. ఇప్పుడు అదే తల్లులపై బండ రూపంలో భారం మోపారు. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యజనం పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. తాజాగా పెరిగిన గ్యాస్‌బండ భారంతో పేద, మధ్యతరగతి జనం ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతారన్నది ప్రశ్న.
పెరిగిన బండ భారం మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. దీని ద్వారా పీఎంయూవై లబ్దిదారులకు, ఇతర విని యోగదారులకు ఇది భారమే. ఈ పెంపు గ్యాస్ వినియోగదారులకే కాదు సబ్సిడీ కింద సిలిండర్లను అందిస్తున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనా భారం పడనుంది. అదేవిధంగా పెట్రోల్, డీజీల్‌పై రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. ఈ పెంపుతో వినియోగదారులపై ప్రభావం పడదని, ఈ భారాన్ని చమురు మార్కెటింగ్ కంపెనీల భరిస్తాయని కేంద్రం వివరించింది. సుంకం పెంపు వల్ల కేంద్రానికి ఆదాయం లభిస్తోంది. పదిహేను రోజులకోసారి ధరలను సమీక్షిస్తూ నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకటించడంతో ఎప్పుడైనా ధరలు పెరగడం ఖాయమని తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితమే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.41 మేర ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లు తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సామాన్యులకు ధరాఘాతమే. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినపుప్పడు రూ.399 ఉన్న ధర.. ఇప్పుడు ధర రూ.900కు పైగా చేరింది. పదకొండేండ్లలో 130.57 శాతం ధర పెరిగినట్టయింది. వంట గ్యాస్ ధర పెంపుదల భారం గతంలో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపైనే పడేది. ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆ వర్గాల ప్రజలపైనా ప్రధాని మోడీ మొట్టమొదటిసారి భారాన్ని మోపారు. ఇప్పటికే గ్యాస్ ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరగా, భవిష్యత్తులో మరింత భారం మోపే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న పలు వస్తువుల ధరలతో సతమత మవుతున్న సాధారణ ప్రజలు.. వంట గ్యాస్ ధరలను అమాంతంగా పెంచటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతంలో ఎదురైన నష్టాలను పూడ్చుకోవటంలో భాగంగా ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు తప్ప వినియోగదారులపై భారం పడదు అని కేంద్రప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి సాధారణ ఎన్నికలకు ముందు 2024లో కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజీల్‌పై లీటర్‌కు రెండు రూపాయల చొప్పున ధర తగ్గించింది. దాంతో మోడీని ఆకాశానికెత్తేశారు. తాజాగా ఎక్సైజ్ సుంకం రూపంలో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రెండు రూపాయలు విధించింది. అప్పుడు కోల్పోయిన నష్టాన్ని తాజాగా సమకూర్చింది. 32 వేల కోట్ల రూపాయలను అర్జించబోతుంది. ఎక్సైజ్ సుంకం రూపంలో గతంలో కోట్ల రూపాయలను వెనకేసుకున్న ప్రభుత్వం.. వాటిని పారిశ్రామికవేత్తలకు ఉపయోగించింది తప్ప సామాన్యులకు ఉపయోగించింది శూన్యం. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతికూల ఆర్థిక, వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో మోడీ సర్కారు ధరల పెంపు నిర్ణయం తీసుకుందన్నది వాస్తవం. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి నప్పుడల్లా ప్రజలను పక్కదారి పట్టించి ధరలు పెంపు భారాన్ని జనంపై మోపడం కేంద్రానికి కొత్తేం కాదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం మతపరమైన అంశాలను ముందుకుతెచ్చి లబ్దిపొందుతూ వస్తోంది. పెట్రోధరల విషయంలో బీజేపీ ప్రభుత్వం అధికార దోపిడీకి పాల్పడుతున్నది. ‘అచ్ఛేదిన్’ ఇప్పుడు కనుచూపు మేరలో కూడా లేదు. ముడిచమురు ధరల పెరుగుతుండటమే వల్లే భారం వేయాల్సి వస్తుందంటున్న ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినప్పుడు గానీ ఆ ఫలితాలను వినియో గదారులకు అందించేందుకు చేతులు రాకపోవడం దారుణం. ప్రభుత్వం నిజంగా ప్రజలతో ఉందని భావిస్తే ఇంధనంపై అధిక ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలి. అభివృద్ధి ముసుగులో భారం మోపే విధానాలను ప్రజలు నమ్మరు. అటువంటి వాటిని ప్రజలు వ్యతిరేకించాలి. ధరలు తగ్గించేందుకు పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములవ్వాలి.