భారీగా రూ.65,900 కోట్ల లోటు..2026లో ఇదే తొలిసారి!
ముంబయి : భారత బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటుంది. బ్యాంక్‌ల్లో ద్రవ్య లభ్యత ఒక్కసారిగా భారీ లోటులోకి జారుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు రోజువా రి సగటున రూ.2.50 లక్షల కోట్ల నగదు మిగులు ఉండగా.. ప్రస్తుతం అది రూ.65,900 కోట్ల (7.01 బిలియన్ డాలర్లు) లోటుకు చేరకుంది. ఇది గతేడాది డిసెంబర్ 29 తర్వాత నమోదైన అత్యధిక లోటు స్థాయి. ప్రస్తుతం పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. 2026 సంవత్సరంలో ఇంతటి స్థాయిలో నగదు కొరత ఏర్పడటం ఇదే తొలిసారి. ప్రధానంగా భారీగా పన్ను చెల్లింపులు జరగడం, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో రూపాయి తీవ్రంగా పతనం కావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న చర్యలతో నగదు లభ్యత తగ్గింది.
ప్రధాన కారణాలు..
ఆర్థిక సంవత్సరం 2025- 26 ముగింపు నేపథ్యంలో అడ్వాన్స్ టాక్స్, జీఎస్టీ రూపంలో భారీగా నగదు బ్యాంకుల నుంచి బయటకు వెళ్లడం ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ సాక్షి గుప్తా తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. దీన్ని అడ్డుకునేందుకు మార్చి నెలలో ఆర్‌బీఐ సుమారు 20 బిలియన్
డాలర్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. నగదు కొరత ప్రభావంతో స్వల్పకాలిక రుణాల రేట్లు ఆర్‌బీఐ పాలసీ రేటు 5.25 శాతం కంటే 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.35 శాతానికి పెరిగింది. ఇది బ్యాంక్‌ల్లోని నగదుపైనా ఒత్తిడి పెంచింది. ఆర్థిక ఒత్తిడి మార్చి 31 తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపులో ప్రభుత్వం చేసే ఖర్చుల వల్ల తిరిగి వ్యవస్థలోకి నగదు చేరుతుందని అంచనా వేస్తున్నారు.



