మెహిదీపట్నం స్కైవాక్‌కు తొలగిన అడ్డంకులు..

నవతెలంగాణ – హైదరాబాద్: పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ మెహిదీపట్నంలో హెచ్‌ఎండీఏ చేపడుతున్న స్కైవాక్‌ నిర్మాణానికి కేంద్రం లైన్‌ క్లియర్‌ చేసింది. పెరిగిన ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలను కేసీఆర్‌ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. మెహిదీపట్నం రైతుబజార్‌ ఎదురుగా ఉన్న బస్టాప్‌ నుంచి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కింద నుంచి రోడ్డు అవతల వైపు రూ.34 కోట్లతో అత్యాధునిక నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ఒకవైపు రక్షణ క్యాంపస్‌ స్థలం ఉండడంతో భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించలేదు. దీంతో రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలాన్ని తమకు బదిలీ చేయాలని అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పలుమార్లు రక్షణ శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. దీంతో గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. స్కై వే నిర్మాణానికి అవసరమైన మేరకు భూమిని కేటాయించేందుకు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో వీలైనంత త్వరగా ఈ స్కైవే నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే మే నెలాఖరు నాటికల్లా ఈ స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.

Spread the love