ఒరిస్సా ఘటన మరువక ముందే మరో ఉలికిపాటు

– ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు
– బొమ్మాయిపల్లి- పగిడిపల్లి మధ్యలో రైల్ నిలిపివేత
– ఆరు బోగీలు దగ్ధం
– అప్రమత్తమైన అధికారులు
– ఆందోళనలో పరుగులు తీసిన ప్రయాణికులు
– ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
– సమగ్ర దర్యాప్తుకు సిద్ధమైన రైల్వే అధికారులు
– సంఘటన స్థలంలో జీఎం అనిల్ కుమార్ జైన్, చౌహన్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి…
నవతెలంగాణ భువనగిరి రూరల్ 
ఘోర ప్రమాదం తప్పి పోయింది..ఏక కాలంలో ప్రయాణిస్తున్న  ఫలక్ నుమా  ఎక్స్ ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి గురయ్యింది.. ఒరిస్సా ఘటన మరువక ముందే మరో ఉలిక్కి పాటు సంభవించింది..క్షణాల్లోనే రైల్లో నుంచి దట్టమైన పొగలు రావడం..చూస్తుండగానే ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి.. రిటైడ్ ఆర్మీ ఉద్యోగి  అవల్ధార్ దుర్గారావ్ చకచక్యంతో చైన్ లాగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి – పగిడిపల్లి మధ్యలో రైలును నిలిపివేసి ప్రయాణికులను రైలులో నుంచి దించి పెను ప్రమాదాన్ని తప్పించారు.. అగ్నిప్రమాధ సంఘటన స్థలానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, రాచకొండ సీపీ డీఎస్ చౌహన్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, డిఆర్ ఎం  అభయ్ కుమార్ గుప్తా, కలెక్టర్ పమేలా సత్పతి లు చేరుకొని ప్రమాద సంఘటనను తెలుసుకున్నారు… ప్రయాణికులను ప్రత్యేక బస్సులలో సికింద్రాబాద్ కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని బొమ్మాయిపల్లి – పగిడిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్ కు వచ్చే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ (రైలు నెంబర్ 12703) అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఉదయం 10: 46 గంటల సమయంలో ఎస్ 4 నుంచి పొగలు రావడం గుర్తించి ప్రయాణికుడు అప్రమత్తమై చైన్ లాగాడు.. దీంతో రైల్వే లోకో ఫైలేట్  సమాచారం తెలుసుకొని రైలు ను నిలిపివేశారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చూస్తుండగానే ఎస్ 4 లో మంటలు ఎగసి పడడంతో వేను వెంటనే ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. దట్టమైన పొగలు విస్తరించడం, ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడడంతో అగ్నిమాపక సిబ్బంది, రైల్వే, పోలీస్ అధికారులు, ఎన్ డిఆర్ ఎఫ్ బలగాలు, సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎగిసి పడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. ఎస్ 4 భోగి నుండి  మంటలు వ్యాపించి ఎస్ 5, ఎస్ 6, ఎస్ 7 ఎస్3, ఎస్ 2 బోగిలకు వ్యాపించాయి. మంటలు అదుపులోకి తీసుకుంటూనే చివరి 3 బోగీలు,  ఇంజన్ వద్ద ఎస్ 8 నుంచి ఉన్న భోగిలను సిబ్బంది తప్పించారు. ముందు, చివరి భోగిలను తప్పించి బలగాల సాయంతో వెనుకకు నెట్టారు. ఒరిస్సా లోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘటన మరువక ముందే అగ్ని ప్రమాద సంఘటనతో ఉలిక్కిపాటు కు గురయ్యారు. ప్రయాణికులు ఆందోళనతో పరుగులు పెట్టారు. 6 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
సంఘటన స్థలంలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్..
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్  రైలు భువనగిరి ప్రాంతంలో  అగ్నిప్రమాదానికి గురి అయ్యిందని తెలిసిన వెంటనే తమ సిబ్బందితి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు ఎగిసి పడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చెస్తున్నారు. సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సంఘటన వివరాలను సేకరించారు. ప్రయాణికులతో మాట్లాడి సురక్షిత ప్రాంతాలకు చేరవేసే చర్యలను చేపట్టారు. అగ్నిప్రమాద సంఘటన పై సమగ్ర దర్యాప్తు కు ఆదేశించారు.
దారి మళ్లించిన రైళ్లు..
హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్నిప్రమాదానికి గురికావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు . సికింద్రాబాద్‌-రేపల్లె, సికింద్రాబాద్‌-మన్మాడ్‌ (అజంతా ఎక్స్‌ప్రెస్‌) రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. సికింద్రాబాద్‌ – తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌(వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా మళ్లించారు. ప‌ల‌క్ నుమాలోని 18 బోగీల‌లో ఆరు బోగీలు కాలిపోయాయి. 9 బోగీల‌తో రైలు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల స‌మ‌యంలో సికింద్రాబాద్ కు చేరుకుంది.
బస్సుల్లో ప్రయాణికుల చేరవేత..
కాలిపోయిన బోగీల ప్ర‌యాణీకుల‌ను ప్రత్యేకంగా బ‌స్సుల‌లో సికింద్రాబాద్ కు చేర్చారు. ప్రయాణికులకు అల్పాహారాన్ని, తాగు నీరును అందిచి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రయాణీకులంద‌రూ సుర‌క్షింతంగా ఉండ‌టంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రైల్వే పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.మొత్తం ఆరు బోగీలు కాలిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌మాద‌ కార‌ణాల‌ను  ద‌ర్యాప్తు చేస్తునట్లు అధికారులు వెల్ల‌డించారు.
చైన్ లాగి  కాపాడిన రిటైడ్ ఆర్మీ ఉద్యోగి దుర్గారావ్..
యాదాద్రి భువనగిరి  జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికుడు రిటైడ్ ఆర్మీ ఉద్యోగి శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన అవల్ధార్ దుర్గా రావ్ గమనించి  11: 06 గంటలకు చైన్‌ లాగడంతో పైలట్‌ వెంటనే రైలును నిలిపివేశారు. ప్ర‌యాణీకుల‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. ఆ బోగీలు ప్ర‌యాణీకులు వెంట‌నే కింద‌కు దిగారు.. మిగిలిన బోగీల ప్ర‌యాణీకుల‌ను సైతం హెచ్చ‌రించ‌డంతో వారు సైతం బోగీల నుంచి బ‌య‌ట‌కు దూకేశారు. ప్ర‌యాణీకులు దిగుతుండ‌గానే మంటలు పక్క బోగీలకు అంటుకున్నాయి. ఎస్ 4, 5, 6, 7,3,2 పూర్తిగా కాలిపోయాయి.  చైన్‌ లాగకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుందంటూ  ప్రయాణికులు ఊపిరి పీల్చుకొని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
అప్రమత్తతే ప్రమాదాన్ని తప్పించింది..
అధికారుల అప్రమత్తతే పెను ప్రమాదాన్ని తప్పించింది. వెనువెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనులు చేపట్టారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, రాచకొండ సీపీ డి ఎస్ చౌహన్,  డిఆర్ ఎం అభయ్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డిసిపి రాజేష్ చంద్ర, ట్రాఫిక్ డిసిపి అభిషేక్ మహంతి,  ఆర్డీవో  భూపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఏసీపీ లు వెంకట్ రెడ్డి, నర్సింహా రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది, ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు, ట్రాఫిక్, రైల్వే పోలీసులు, ఆయా శాఖల అధికారులు సహాయక చర్యలు చెపట్టారు. కాగా కాలిపోయిన ఆరు భోగిలకు సంబంధించి బిబి నగర్లో రైల్వే స్టేషన్లో  16 విభాగాల నిపుణుల బృందం రైల్వే ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
Spread the love