బీఫార్మసీ విద్యార్థి రైలు క్రిందపడి ఆత్మహత్య

నవతెలంగాణ-రామారెడ్డి : మంచి చదువులు చదివి, ఉన్నత స్థానంలో స్థిరపడి, తల్లిదండ్రులకు, కుటుంబానికి అండగా ఉంటాడని, కష్టపడి వ్యవసాయం చేస్తూ కొడుకును బీఫార్మసీ చదివిస్తున్న తల్లిదండ్రులకు, కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని గోకుల్ తాండాకు చెందిన బాదావత్ లక్ష్మి, మోహన్ లకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్ళగా, రెండవ కుమారుడు బాదావత్ అనిల్ (18 )ఖమ్మంలో బీఫార్మసీ చదువుతున్నాడు. దసరా సెలవులపై ఇంటికి వస్తున్నారని, రంగంపేట రావాలని తండ్రికి ఫోన్లో సమాచారం అందించాడు. మండలంలోని రంగంపేటకు తండ్రి వెళ్లేసరికి, గుర్తుతెలియని రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో తునక తునకలుగా చెల్లా చెదరైన శరీర భాగాలను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
Spread the love