అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్
చిట్యాల మహాత్మా జ్యోతిభా పూలే బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-వనపర్తి
యువర్ డిపి ఇవన్నీ ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ వనపర్తి మండలం చిట్యాల గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పరిపాలనా అంశాలు, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా పాఠశాలలోని ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, విద్యార్థుల నమోదు వివరాలు, సరుకుల నిల్వకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు, భోజన నిర్వహణ రికార్డులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన అన్ని రికార్డులు, రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సక్రమంగా, పక్కాగా నిర్వహించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, వసతి, భోజనం, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాన్ని బోధించి, పలు ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని పరిశీలించారు. విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టడంతో పాటు పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను తెలుసుకున్నారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో బోధన కొనసాగించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



